తేజస్వీ యాదవ్ కు సుప్రీంలో చుక్కెదురు

The son of RJD chief Lalu Prasad Yadav,
Date:09/02/2019
పాట్నా ముచ్చట్లు:
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీచేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయడంతో పాటు తమ కాలాన్ని వృథా చేసినందుకు రూ.50 వేల జరిమానా విధించింది. ఆర్జేడీ, జేడీయూ కూటమి ప్రభుత్వంలో కొనసాగిన సమయంలో తేజస్వీ డిప్యూటీ సీఎంగా వ్యహరించారు. నితీశ్ కుమార్ కూటమి నుంచి వైదొలిగి సీఎం పదవికి రాజీనామా చేసి, బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంలకు కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయాలని, ప్రతిపక్షనేతకు ఇచ్చే నివాసంలో ఉండాలని పాట్నా హైకోర్టు తేజస్వీని ఆదేశించింది. అయితే ప్రొటోకాల్ విషయంలో రాష్ట్ర మంత్రికి, ప్రతిపక్షనేతకు ఒకే హోదా ఉంటుందని, డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో కేటాయించిన బంగ్లాలోనే నివాసం ఉంటానంటూ ఆర్జేడీ నేత తేజస్వీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తేజస్వి పిటిషన్‌ను విచారించింది. డిప్యూటీ సీఎం హోదా పోయిన తర్వాత అదే బంగ్లాలో ఉండేందుకు తేజస్వీ యాదవ్‌కు అవకాశం లేదని, సాధ్యమైనంత త్వరగా ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేయడంతో పాటు విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగానూ రూ.50 వేల జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో వెల్లడించారు. కాగా, 2015లో డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం తేజస్వీకి ఆ బంగ్లాను కేటాయించింది. కూటమి నుంచి నితీశ్ తప్పుకున్న అనంతరం డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి ఆ బంగ్లాను కేటాయించారు. తాను అదే బంగ్లాలో ఉంటానని తేజస్వీ ఈ జనవరి 7న దాఖలు చేసుకున్న పిటిషన్‌ను పాట్నా హైకోర్టు తోసి పుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది.
Tags:Tejaswi Yadav will go to Supri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *