జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ఫార్ములా

Date:20/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వేగం పెంచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో బిజెపి వ్యతిరేక పార్టీలను ఒక చెట్టుకిందకు తీసుకురావడం అంత చిన్న విషయం కాదు. ఇప్పటినుంచి అందుకు ఎవరో ఒకరు కృషి చేయాలి. పిల్లి మెడలో గంట కట్టే వారికోసం వెతుకుతున్న కాంగ్రెస్ కి కలిసొచ్చారు చంద్రబాబు. దాంతో అనుభవజ్ఞుడు అయిన ఎపి చంద్రుడికి ఆ బాధ్యతలు అప్పగించారు రాహుల్. ఈ నేపథ్యంలో తనదైన స్కూల్ స్టార్ట్ చేసి తొలి అస్త్రాన్ని కేంద్రసర్కార్ పై ప్రయోగించి నా తరహా రాజకీయం అనుసరిస్తే మోడీ దిమ్మ తిరుగుతుందని చాటి చెప్పారుమోడీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలతో హస్తినలో రాహుల్ తో పాటు భేటీ అవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ తో భేటీ అయ్యారు. ఇప్పటికే కర్ణాటక సిఎం కుమార స్వామి, మాజీ ప్రధాని దేవగౌడలతో సమావేశం అయిన బాబు, డీఎంకే, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆప్ అగ్రనేతలను కలిశారు. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలతోను ములాఖత్ అయ్యారు. ఏపీలో ఐటి దాడుల అనంతరం జాతీయ స్థాయిలో రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారించారు బాబు.
సిబిఐ దర్యాప్తులకు తన జివో ద్వారా చెక్ పెట్టి కేంద్రానికి కొత్త హెచ్చరికలు పంపారు. బాబు వాడిన ఈ ఫార్ములా నచ్చిన మమతా బెనర్జీ కూడా అదే బాటలో వెళ్ళేలా చేయగలిగారు. ఇక కర్ణాటక లో కూడా బాబు ఫార్ములా అనుసరించడానికి కుమారా స్వామి సిద్ధం కానున్నారు.ఒక పక్క కేంద్రంతో నేరుగా యుద్ధం చేస్తూనే బలమైన ప్రతిపక్షాన్ని సిద్ధం చేస్తూ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు చంద్రబాబు. ఎన్డీఏ కన్వీనర్ గా గతంలో వివిధ పార్టీల అగ్రనేతలతో వున్న సాన్నిహిత్యాన్ని పూర్తిగా వినియోగిస్తున్నారు చంద్రబాబు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినప్పుడే రాష్ట్రంలో తన పలుకుబడి మసకబారకుండా కాపాడుకోవొచ్చని పసుపు పార్టీ అధినేత లెక్కస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోడీ సర్కార్ లో చేరాక బాబు ఢీల్లీ రాజకీయాలకు తెరపడింది. దాంతో గత వైభవాన్ని అందిపుచ్చుకోవాలంటే మరోసారి తన చాణక్య రాజకీయాన్ని తెరపైకి తెచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చంద్రబాబు. మరి ఆయన చక్రం తిరుగుతుందో రాహుల్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ ఛాన్స్ ఆయనకు ఇస్తారో లేదో వచ్చే ఎన్నికలకు ముందే తేలిపోనుంది.
Tags:Telangana formula in national politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *