బీహార్ లో సీఎంపై చెప్పు

Date:11/10/2018
పాట్నా  ముచ్చట్లు:
బిహార్‌లో రిజర్వేషన్ల చిచ్చు పెల్లుబుకుతోంది. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపైకే చెప్పు విసిరే వరకూ వెళ్లింది. రిజర్వేషన్ల కారణంగా అగ్ర కులాల వారికి అన్యాయం జరుగుతోందంటూ ఓ వ్యక్తి సీఎం నితీశ్ కుమార్‌పైకి చెప్పు విసిరాడు. గురువారం  మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్ సమావేశం ‘విరాట్ ఛాత్ర సనగమ్’లో సీఎం నితీష్ మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. యూత్ వింగ్ కార్యకర్తలు చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌కు చెందిన చందన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్ ఈ చర్యకు పాల్పడ్డాడు.
తాను అగ్ర కులానికి చెందిన వ్యక్తినని, రిజర్వేషన్ల వ్యవస్థ కారణంగా తనకు ఉద్యోగం లభించలేదని చందన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్‌కు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి దేశంలో అగ్ర కులాల ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా బిహార్‌లో గత సెప్టెంబర్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కేంద్రం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందంటూ అగ్ర కులాలకు చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం కిందట కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ నిరసనల సెగ తగిలింది.
ఈ సందర్భంగా నిరసనకారులు, బీజేపీ యువ మోర్చా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. సీఎం నితీష్ కుమార్‌పైకి చెప్పు విసిరిన సమయంలో జనతాదళ్‌లో పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా పక్కనే ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ ఇటీవలే జనతాదళ్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం నితీశ్‌పైకి చెప్పు విసరడం ఇదే తొలిసారి కాదు. 2016లో పీకే రాయ్ అనే వ్యక్తి నితీశ్ పైకి చెప్పు విసిరాడు.
Tags:Tell the CE in Bihar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *