యూపీలో బీజేపీకి తెలుగు ఎఫెక్ట్

Date:15/03/2018
లక్నో ముచ్చట్లు:
జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన తెలుగుదేశం సమన్వయ కమిటీతో భేటీ అయ్యారు. ఈసమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, వైసీపీ వ్యవహారశైలిపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో రెండు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. సభలో ప్రతిపక్షం లేకున్నాప్రజలే ప్రతిపక్షంగా భావించి వ్యవహరించాలని ఎమ్మెల్యేలకు తెలిపారు. యూపీలో ప్రతిపక్షం బలంగా లేకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించినట్లు తెలిసింది. అందుకే ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్లిందని, దాని ఫలితమే ఈ ఎన్నికల్లో కన్పిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది.యూపీ, బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మెట్టు దిగి వస్తుందని టీడీపీ భావిస్తుంది. ఉత్తరాదిన ఆ పార్టీకి పట్టున్న చోట ఓటమి పాలుకావడమంటే కేంద్ర ప్రభుత్వంపై కూడా దేశ వ్యాప్తంగా మోడీపై వ్యతిరేకత ఎదురువుతుందని టీడీపీ అభిప్రాయపడుతుంది. మొన్న రాజస్థాన్ ఉప ఎన్నికల్లో సయితం బీజేపీ పరాజయం పాలు కావడాన్ని ఈ సందర్భంగా కొందరు నేతలు ప్రస్తావించారు. త్రిపుర, మేఘాలయలో కూడా బీజేపీ గెలిచినా అది గెలుపు కాదని, ఓట్ల శాతం చాలా తక్కువగా ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు.ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ వెనుకబడి పోవడానికి కారణం తెలుగువారేనట. ముఖ్యంగా గొరఖ్ పూర్ నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన తెలుగుప్రజలు ఎక్కువగా ఉన్నారని, బీజేపీ ఏపీకి అన్యాయం చేయడంతోనే అక్కడి తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కర్ణాటకలో ఉన్న తెలుగువాళ్లు కూడా బీజేపీకి తప్పక బుద్ధి చెబుతారని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, బండారు సత్యనారాయణలు అన్నారు. తెలుగు ప్రజల ఉసురు బీజేపీకి తగులుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ వాస్తవాలను తెలుసుకుని ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలని కోరుతున్నారు.
Tags: Telugu Effect for BJP in UP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *