గుడ్లకు టెండర్

Date:08/11/2018
కాకినాడ ముచ్చట్లు:
పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కోడిగుడ్ల సరఫరా బాధ్యత మళ్లీ మొదటికొచ్చింది. గుడ్ల కొనుగోలుకు ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో వీటి సరఫరా బాధ్యతను తిరిగి కాంట్రాక్టరుకే అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జిల్లాలోని పాఠశాలలకు గుడ్లు సరఫరా చేయాలని పేర్కొన్నారు.
గత నెలలో కాంట్రాక్టు గడువు ముగియడంతో కోడిగుడ్లను ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలే కొనుగోలు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. కోడిగుడ్డు ఒక్కింటికి రూ.4.68 చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే గత నెల 29 నుంచి 31వ తేదీ వరకూ మూడు రోజుల పాటు గుడ్ల సరఫరా నిలిచిపోయింది.
దీంతో ఒకటో తేదీ నుంచే ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలే కోడిగుడ్లను కొనుగోలు చేసి విద్యార్థులకు అందించాలని, నెలాఖరున బిల్లు పెడితే డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ముందుగా కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి పెట్టలేమని స్వచ్ఛంద సంస్థలు, ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలు ఎంఈవోల ద్వారా అధికారులకు తెలియజేశాయి. దీంతో ప్రభుత్వం ఒక్క రోజులోనే నిర్ణయం మార్చుకుని కోడిగుడ్లను సరఫరా చేసే బాధ్యతను తిరిగి కాంట్రాక్టరుకే అప్పగించింది.
కాంట్రాక్టరు కోడిగుడ్లను సరఫరా చేసేందుకు నిరాకరించడానికి ప్రధాన కారణం ధర సరిపోకపోవడమే. కోడిగుడ్డు ఒక్కింటికి ప్రభుత్వం రూ.4.68 చెల్లిస్తోంది. మార్కెట్‌ ధరలో హెచ్చుతగ్గులు రావడంతో ఈ మొత్తం తమకు సరిపోవడంలేదని కాంట్రాక్టరు చెబుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం పాత ధరకే కోడిగుడ్లు సరఫరా చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
జిల్లాలోని 4,260 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రతి రోజూ సగటున 2.80 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారంలోని ఆరు పని దినాల్లో తప్పనిసరిగా ఐదు రోజులు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన వారానికి 14 లక్షలు, నెలకు సుమారు 56 లక్షల కోడిగుడ్లు జిల్లాలోని పాఠశాలలకు అవసరమవుతాయి.
Tags: Tender to the eggs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *