నిబంధనలు బేఖాతరు!

Date:17/07/2018
మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చిస్తోంది. అయితే అభివృద్ధి పనులు మాత్రం నాసిరకంగా సాగుతున్నాయని, నాణ్యత లోపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలు పట్టించుకోకుండా.. తోచినట్లు పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. వాస్తవానికి గజ్వేల్‌లోని ఆరు మండలాల్లో పెద్ద పట్టణం తూప్రాన్‌. ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడింది. సమస్య సీఎం కేసీఆర్ వరకూ వెళ్లడంతో ఆయన సీసీ రహదారులు, అంతర్గత మురుగుకాల్వల నిర్మాణాలకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇక అధికార యంత్రాంగం కూడా పనులు నాణ్యతతో ఉండాలని, అవకతవకలు సహించేది లేదని స్పష్టంచేసింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం ఇవేమీ పట్టించుకోవడంలేదు. అధికారులు పర్యవేక్షణకు వచ్చినప్పుడు పనులు పటిష్టంగా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. వారు లేనప్పుడు మాత్రం మాయ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇదిలాఉంటే పట్టణంలోని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లే దారిలో మురుగు కాల్వల నిర్మాణానికి అంతర్గత పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీరాజ్‌ అధికారులు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండడంతో పర్యవేక్షణ కరవైంది. ఇదే  అదనుగా పైపులైన్ల నిర్మాణం తూతూమంత్రంగా సాగించి మట్టి పోసి పూడ్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రెండు పైపులను ఒకదానినొకటి జాగ్రత్తగా అతికించాలి. అలాకాకుండా రెండు పైపులను కలిపి పైనుంచి మట్టి పోశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తూప్రాన్‌ డివిజన్ లో సాగుతున్న అభివృద్ధి పనులను  త్వరితగతిన  పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కాంట్రాక్టర్లు ఇదే అదనుగా భావించి నాణ్యత పట్టించుకోకుండానే.. త్వరగా పనులు పూర్తిచేసేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏబీ కాలనీలోనూ రహదారుల్లో అంతర్గత మురుగుకాల్వల నిర్మాణంలో నాణ్యత లోపించిందని అక్కడివారు అంటున్నారు. కొన్నిచోట్ల పనులు మధ్యలో వదిలేయడంతో తవ్విన గుంతలతో నానాపాట్లు పడుతున్నామని వాపోతున్నారు. తూప్రాన్‌ సుమారు రూ.7.40 కోట్లతో సీసీ రహదారులు, అంతర్గత పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తేనే ఫలితం ఉంటుందని లేకుంటే మాత్రం నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకుంటారని అంతా అంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా పనుల్లో నాణ్యత కొరవడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పనులు జోరందుకుంటున్న నేపథ్యంలో అధికారులు స్పందించి పనులు నాణ్యతగా జరిపించాలని అంతా కోరుతున్నారు. ఇదిలాఉంటే పనుల్లో నాణ్యత లోపించిందని, పైప్ లైన్లను మట్టితో పూడ్చారన్న విమర్శలపై సంబంధిత అధికార యంత్రాంగం స్పందించింది. పనులన్నింటినీ పరిశీలించి నాణ్యంగా లేనివాటిని సరిచేయిస్తామని స్పష్టంచేసింది. ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.
నిబంధనలు బేఖాతరు!https://www.telugumuchatlu.com/terms-disagree-4/
Tags; Terms disagree!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *