అనుకున్న సమయానికి యధావిధిగా పరీక్షలు 

Date:17/02/2018
-వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షా కేంద్రాలు, పేపర్ల దిద్దే కేంద్రాలు పెట్టాలి
-ఇన్విజిలేటర్లుగా, పేపర్లు దిద్దడంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలే వినియోగించుకోవాలి
-విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
-విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమీక్ష
హైదరాబాద్ముచ్చట్లు:
అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల నిర్వహణపై సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష చేశారు. హైస్కూళ్లు, జిల్లా పరిషత్ స్కూళ్లు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రస్తుతం ఫర్నిచర్ బాగుందని, వీలైనంత వరకు పరీక్షల కేంద్రాలు అక్కడే ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఫీజు రియంబర్స్ మెంట్ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే ఇవ్వకపోతే పరీక్షలను బహిష్కరిస్తామని కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పరీక్షల  నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష చేశారు.పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో, మైనారిటీ సంస్థల్లో, సహకరించే ఇతర విద్యాలయాల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఇన్విజిలేటర్లు కూడా వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించాలన్నారు. పేపర్లు దిద్దడంలో కూడా పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలే వినియోగించుకోవాలన్నారు. వీటికి సంబంధించి సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించుకుని రావాలని అధికారులకు సూచించారు. అయితే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణ జరిగే విధంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు కిషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags; Tests as usual as expected

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *