తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
తిరుపతి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి.యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 5వ తేదీ సాయంత్రం పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. సెప్టెంబరు 6న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, లఘు పూర్ణాహుతి చేపడతారు. సెప్టెంబరు 7న పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Tags: Thallapaka Sri Siddheswara Swamy temple consecration ceremonies
