Natyam ad

కన్నా..బుట్ట సర్దేస్తున్నారా…

గుంటూరు ముచ్చట్లు:

మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీఎం రేసులో నిలబడిన కన్నా లక్ష్మీనారాయణ మౌనం కేడర్‌కు అర్థం కావడం లేదట. గతంలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరసగా గెలిచారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. 2009లో అక్కడి నుంచి కూడా గెలిచారు కన్నా. మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఇబ్బంది పడ్డారు. వైసీపీ ఆహ్వానాన్ని కాదని.. బీజేపీలో చేరడం.. ఆ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్‌ కావడం.. ఆయన నేతృత్వంలో 2019 ఎన్నికలకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో కన్నా మౌనం కేడర్‌కు అంతుచిక్కడం లేదట.కొద్ది రోజులుగా కన్నా లక్ష్మీనారాయణను రాజ్యసభకు పంపుతారని.. అందుకే ఏపీ బీజేపీ చీఫ్‌ పదవి నుంచి తప్పించారని అనుచరులు ప్రచారం చేశారు. అయితే ఏపీలో బీజేపీ పరిస్థితి కారణంగా అది ఆలస్యమైనా.. ఎన్నికల లోపు ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నారట. మరి.. రాజ్యసభ సీటు ఇవ్వకపోతే కన్నా ఏం చేస్తారు అనేది ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గెలిస్తే ఏంటి? గెలవకపోతే ఏం జరుగుతుంది అనే లెక్కలతో కేడర్‌ కుస్తీ పడుతోందట. పల్నాడు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని కొందరి వాదన.

 

 

 

తనకు అచ్చి వచ్చిన పెదకూరపాడు నియోజకవర్గం ఉన్న లోక్‌సభ స్థానమైన నరసరావుపేట లేదా సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి బరిలో ఉంటారని మరికొందరు చెబుతున్నారు. అయితే కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న గుంటూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి నుంచే యాక్టివ్‌ కావాలని అనుచరులు కన్నాకు సూచిస్తున్నారట. కూలింగ్‌ పిరియడ్‌ అయిపోయిందని.. సెగ్మెంట్‌ ఎంపిక చేసుకుని క్షేత్రస్థాయి నుంచి పని మొదలు పెట్టకపోతే ఇబ్బందులు ఎదురు కావొచ్చని హెచ్చరిస్తున్నారట. బీజేపీ నాయకత్వం రాజ్యసభ సీటు ఆఫర్‌ చేస్తే అప్పుడు చూద్దాం.. అప్పటి వరకు కామ్‌గా ఉండటం సరికాదన్నది కన్నా అంతర్గత సర్కిళ్లతో వినిపిస్తున్న మాట. గతంలో సీఎం పదవి వరకూ కన్నా పేరు చర్చల్లోకి వెళ్లిందని.. అలాంటి నాయకుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటకపోతే ఇమేజ్‌ కూడా ప్రమాదంలో పడుతుందని అనుచరులు ఆందోళన చెందుతున్నారట.అభిమానులు, అనుచరులు చెప్పింది సావధానంగా ఆలకిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ.. తాను బీజేపీలో ప్రశాంతంగా ఉన్నానని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెబుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని..బీజేపీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధంగా ఉన్నానని కేడర్‌కు బదులిస్తున్నారట కన్నా. అయితే కన్నా విషయంలో బీజేపీ హైకమాండ్‌ ఏం ఆలోచిస్తుందన్నదే ప్రస్తుతం ప్రశ్న.

 

Post Midle

Tags: Than..are you adjusting the basket …

Post Midle