అందుకే బాలయ్య మనసు బంగారమనేది.
అనంతపురం ముచ్చట్లు:
‘పైకి కనిపించేటంత కఠినాత్ముడేమీ కాదు.. ఆయన మనసు బంగారం’.. ఇది నందమూరి బాలకృష్ణ గురించి ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకునే మాటలు. ఇందులో నిజం లేకపోలేదు. సినిమాలు, రాజకీయాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలుస్తుంటారు బాలయ్య. స్టార్ హీరోగా, ఎమ్మెల్యేగానే కాకుండా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అధినేతగా ఇప్పటికే ఎందరికో ఆపన్న హస్తం అందించారాయాన. తన మాతృమూర్తికి జరిగింది ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతో క్యాన్సర్ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు నిత్యం కృషి చేస్తున్నారు. అందుకే ఆయన అభిమానులు ‘జై బాలయ్య’ అని సగర్వంగా చెప్పుకుంటారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారీ నందమూరి నటసింహం. క్యాన్సర్ తో బాధపడుతోన్న ఓ ఇంటర్ అమ్మాయికి చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారట. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఇంటర్ విద్యార్థిని బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆపరేషన్ చేయాలంటే కనీసం రూ.10లక్షలకు పైగా ఖర్చువుతుందని వైద్యులు చెప్పారు. అయితే అంతమొత్తం చెల్లించలేక అమ్మాయి తల్లిదండ్రులు కూతురును ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు.
ఆ అమ్మాయికి కూడా ధైర్యం చెప్పి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కూడా స్టార్ట్ చేయించారట. ఈ విషయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పీఆర్ వంశీ సోషల్ మీదికగా వెల్లడించారు.ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘మా బాలయ్య మనసు బంగారం’ అంటూ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల ఒక చిన్న పాప కూడా బాలయ్య సాయంతో క్యాన్సర్ గండాన్ని గట్టెక్కింది. తల్లిదండ్రులతో కలిసి ఆ పాప అన్‌స్టాపబుల్ షోకి కూడా వచ్చారు. ఆ సమయంలో తనను చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు బాలయ్య. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో బాలయ్య డబుల్ రోల్‌లో కనిపించారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించగా హనిరోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు.

Tags: That is why Balayya’s mind is golden.
