ఆ మూడున్నర కిలోమీటర్లు…నరకప్రాయమే..

Date:14/09/2018
కరీంనగర్ ముచ్చట్లు:
కొండగట్టు గుట్టపై నుంచి కిందికి దిగే 3.5 కిలోమీటర్ల మార్గం అత్యంత భయానక స్థితిలో ఉంది. ప్రమాదకరమైన మలుపులు, వాటి వద్ద కనీసం భద్రతా చర్యలు లేకపోవడం భవిష్యత్‌లో మరెంత మంది ప్రాణాల మీదకు తీసుకొస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగినప్పుడే అధికారులు, నాయకులు రహదారి పరిస్థితిని పరిశీలించి వెళ్లడం సర్వసాధారణంగా మారింది.
2012 మార్చి 21న ఘాట్‌రోడ్డు మధ్యలో లారీ బోల్తాపడి నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం ధర్మోర గ్రామానికి చెందిన 12 మంది దీక్షాపరులు ప్రాణాలో కోల్పోయిన సందర్భంలో పలువురు నాయకులు, అధికారులు ఘాట్‌రోడ్డు అలైన్‌మెంటు మార్చాలని ప్రతిపాదించారు. అప్పటి కలెక్టరు స్మితాసబర్వాల్‌ కొండపైకి భారీ వాహనాలు వెళ్లకుండా ‘వై’ జంక్షను వద్ద ఘాట్‌రోడ్డు ప్రారంభంలో రహదారికి అడ్డంగా ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కొన్ని నెలల తర్వాత వాటిని కొందరు వ్యక్తులు తొలగించినా తర్వాత అధికారులు మళ్లీ ఏర్పాటు చేయలేదు.సుమారు 13 ఏళ్ల కిందట కొండపైన ఆలయ పరిసరాల్లో నాణ్యత లేని నీళ్ల ట్యాంకు కూలిపోవడంతో దాని పక్కన స్నానాలు ఆచరిస్తున్న 8 మంది భక్తులు మరణించిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది.
ప్రమాద సంఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకోని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తాజాగా ఘాట్‌రోడ్డు పక్కన ఆర్టీసి బస్సు లోయలోపడి 60 మంది ప్రయాణికులు చనిపోవడం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
గుట్టపై నుంచి కిందకు వస్తున్న మార్గంలో ఐదు మలుపుల ప్రాంతం భవిష్యత్‌ ప్రయాణాన్ని ఆందోళనలో పడేస్తోంది. మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు, రెయిలింగ్‌ కూడా లేని దుస్థితి ‘సాక్షి’ పరిశీలనలో బయటపడింది.
సాధారణ కల్వర్టు కోసం ఎప్పుడో 15 ఏళ్ల కింద నిర్మించిన కల్వర్టు సిమెంట్‌ రెయిలింగ్‌ ప్రాంతం ఇప్పుడున్న రోడ్డు కింద భాగంలోకి కుచించుకుపోయింది. ఇదే మలుపు వద్ద డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించలేని నష్టం జరిగే ప్రమాదం ఉంది.
ఈ మలుపుల ప్రాంతం నుంచి సుమారు 50 మీటర్ల లోతు ఉన్న లోయల్లో వాహనాలు పడే ప్రమాదం ఉంది. కొన్ని మలుపు ప్రాంతాల్లో రెయిలింగ్స్‌ ఏర్పాటు చేసినా పెద్దగా వాటితో ఉపయోగం లేదు. ఘాట్‌ రోడ్డులో కనీసం 2 మీటర్ల ఎత్తున్న రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాలి.
రేడియం స్టిక్కర్లను ఏర్పాటుచేస్తే ప్రమాదాల నియంత్రణకు అవకాశం ఉంటుంది.లక్షల మంది భక్తులు.. వేల కొద్దీ వాహనాలు.. పైగా ఘాట్‌ రోడ్డు. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం వరుస ప్రమాదాలతో రక్తమోడుతోంది.
ఘాట్‌ రోడ్డు విస్తరణ నిర్లక్ష్యం కంటికి కనిపిస్తున్నా.. ఉన్న రోడ్డు నిర్మాణాన్ని సైతం పాలకులు పట్టించుకోకపోవడంతో 60 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయిప్రమాదం జరిగిన కొండగట్టు ఘాట్‌ రోడ్డులో ఎక్కడ కూడా ప్రమాద నివారణ సూచికలు, భద్రతా చర్యలు పాటించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. అధిక లోడ్‌ ఉన్న వాహనాలను ఈ రోడ్డు మార్గంలో నడపడం ప్రమాదకరమని తెలిసినా నడుపుతున్నారు.
కాగా, కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి చేరుతోంది. ఆలయ కమిటీ, పాలక పక్షాలు, ప్రభుత్వవిభాగాలు కనీసం రోడ్ల విస్తరణ పనులు చేపట్టకపోవడం ఈ కారణానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఘాట్‌ రోడ్డు కనీసం 100 ఫీట్ల నుంచి 120 ఫీట్లు అంటే డబుల్‌ రోడ్డుతో పాటు మధ్యలో రెండు ఫీట్ల వాహనల గ్యాప్‌ వదిలేసేలా ఉండాలి.
కానీ ప్రస్తుతమున్న రోడ్డు 60 నుంచి 80 ఫీట్ల పరిధిలోనే ఉంది ఘాట్‌రోడ్డు కాకుండా కొండగట్టు గుట్టపైకి వచ్చేందుకు దొంగలమర్రి, జేఎన్‌టీయూ కాలేజీ మీదుగా మరో మార్గం ఉంది. ఆ మార్గం సైతం 80 ఫీట్ల లోపుగానే నిర్మితమైంది. ఈ రహదారిలో 40 శాతం మేర ఘాట్‌ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కీలక మలుపులు సైతం వాహనదారులను వణికించేలా కనిపిస్తున్నాయి.
ఘాట్‌ రోడ్‌ విస్తరణతో పాటు జేఎన్‌టీయూ, దొంగలమర్రి రహదారిని విస్తరించే ప్రమాదాల నియంత్రణతో పాటు రాకపోకలు, సౌలభ్యం కూడా కలిసివస్తుందని భక్తులు కోరుతున్నారు.
Tags: That three and a half kilometer …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *