మార్చి 31 నాటికి శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లు పూర్తి కావాలి
– భక్తులంతా కోదండరాముని కల్యాణం తనివితీరా చూసేలా సదుపాయాలుండాలి
-టీటీడీ అధికారులు జిల్లా యంత్రాంగంతో రోజూ సమన్వయం చేసుకోవాలి
– సమిష్టి కృషితో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
-టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి

తిరుపతి ముచ్చట్లు:
టీటీడీ లోని అన్ని విభాగాల అధికారులు ఆయా విభాగాలకు సంబంధించి టీములుగా నియమించిన జిల్లా యంత్రాంగంలోని అధికారులతో ప్రతి రోజు సమన్వయం చేసుకుని స్వామి వారి కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైవై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్ పి
అన్బురాజన్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఈవో ఆదివారం ఒంటిమిట్ట లో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,టీటీడీ అధికారులు,అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకుని మార్చి 31వ తేదీ లోగా కల్యాణ వేదిక వద్ద సిసి కెమెరాలు ,కంట్రోల్ రూమ్, బ్యారికేడ్లు , గ్యాలరీలు, విద్యుత్ ఇతర పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
మార్చి నెలాఖరులో మరోసారి పనుల పురోగతిపై క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు.ఏప్రిల్ 5వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. కల్యాణానికి విచ్చేసే భక్తులు వారు కూర్చునే గ్యాలరీల్లోనే అన్నప్రసాదం ,తాగునీరు, అక్షింతలు అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్
విజయరామరాజు మాట్లాడుతూ, శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు,హెల్ప్ డెస్క్ లు, సైన్ బోర్డులు, పారిశుధ్యం, విఐపి పాసులు,పార్కింగ్ ప్రదేశాలు,పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో పాటు టీటీడీ లోని ఆయా విభాగాధిపతులతో కమిటీలు నియమించామన్నారు.
ఈ కమిటీలు తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంతో పూర్తి చేయాలని చెప్పారు.
జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ, గత ఏడాది 3500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈసారి 4వేల మందిని బందోబస్తుకు నియమిస్తున్నామని చెప్పారు. పార్కింగ్,సిసి కెమెరాలు , కంట్రోల్ రూం నిర్వహణకు సంబంధించిన సిబ్బంది రెండు రోజుల ముందు నుంచే విధుల్లో ఉంటారన్నారు.అనంతరం వీరు కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. టీటీడీ జేఈవో వీర బ్రహ్మం,వై ఎస్ ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ , ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ కుమార్ , టీటీడీసిఈ నాగేశ్వరరావు జిల్లా యంత్రాంగానికి చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వేగవంతంగా పనులు: జేఈవో శ్రీవీరబ్రహ్మం
శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు , కల్యాణోత్సవానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.కల్యాణ వేదిక వద్ద జరుగుతున్నపనులను ఈవో, జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ పరిశీలించిన అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడారు. కల్యాణం ఏర్పాట్లపై ఈవో ఆధ్వర్యంలో సమీక్ష జరిపారని చెప్పారు. జిల్లా యంత్రాంగం సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Tags: The arrangements for the welfare of Sri Sitaram should be completed by March 31
