పడకేసిన పారిశుద్ధ్యం (కృష్ణా)

Date:18/09/2018
మచిలీపట్నం ముచ్చట్లు:
జిల్లాలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోంది. జిల్లాలోని 8 మున్సిపాలిటీలు సంఘాలతో పాటు 970 పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఎక్కడికక్కడే రోజుల తరబడి నిలిచి ఉన్న నీటితో దోమల ఉద్ధృతి పెరిగింది.
గత కొద్ది రోజులుగా దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తొలకరి సీజన్‌ ప్రారంభం కాగానే దోమల నివారణ చర్యలు మొక్కుబడిగా చేపట్టి చేతులు దులుపుకొన్న యంత్రాంగం ప్రస్తుతం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో గత రోజుల వ్యవధిలో ఓపీ పెరిగింది. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దున ఉండటంతో చికిత్స నిమిత్తం జ్వరపీడితులు ఇక్కడికే తరలివస్తున్నారు.
రోజుకు 150 మంది వరకు చికిత్స నిమిత్తం వస్తుండగా వీరిలో 20 మంది వరకు జ్వరంతో బాధపడుతున్నారు. ఇన్‌పేషెంట్‌ వార్డుల్లో పది మంది వరకు విషజ్వరాలు, టైఫాయిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. తిరువూరు పట్టణ పరిధిలో 12 వరకు ప్రైవేటు వైద్యశాలలు ఉండగా జ్వరపీడితుల తాకిడి పెరిగింది. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 100 నుంచి 150 మంది చికిత్స నిమిత్తం వస్తుండగా వీరిలో 60 మంది వరకు జ్వరపీడితులు ఉంటున్నారు.
మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరంతో బాధ పడుతూ వచ్చిన పీడితులు.. జూన్‌లో 50.. జులై 75.. ఆగస్టు 15 వరకూ 120 వరకూ నమోదయ్యారు. ఇంకా సాధారణ జ్వరపీడితులు ఆసుపత్రికి వస్తునే ఉన్నారు.  పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజూ 25 నుంచి 30 వరకూ జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
కలిదిండి మండలం మూలలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 నుంచి 30 వరకూ, కలిదిండి, కోరుకొల్లులో 15 మంది చొప్పున రోగులు నమోదవుతున్నారు. విస్సన్నపేట మండలం విస్సన్నపేట ఉన్నతస్థాయి ఆరోగ్య కేంద్రంలో 50 నుంచి 60 వరకూ.. తెల్లదేవరపల్లిలో రోజూ 20 వరకూ జ్వరం కేసులు నమోదవుతున్నాయి.‌
గంపలగూడెం మండలం వినగడప గ్రామంలో జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు.  నందిగామకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని మారం జయశ్రీ ఇటీవల డెంగీ లక్షణాలతో మృత్యువాత పడింది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో పట్టణ, పల్లెల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. సీజనల్‌ వ్యాధులు ప్రబలటానికి దోహదం చేస్తోంది.
ఇక్కడి వైద్యశాలకు రోజుకు 200 మంది చికిత్స నిమిత్తం వస్తుండగా వీరిలో 15 మంది జ్వరంతో బాధపడుతున్నారు. తిరువూరు మధిరరోడ్డుకు చెందిన కె.భారతి జ్వరంతో బాధపడుతూ ప్రాంతీయ వైద్యశాలలో  చికిత్స పొందారు.
ఏటా జూన్‌ నుంచి నవంబరు వరకు సీజనల్‌ వ్యాధుల తీవ్రత కొనసాగుతుంది. ఈ కాలంలోనే దోమల బెడద కూడా అధికంగా ఉంటుంది. ఈ ఏడాది మాత్రం సీజనల్‌ వ్యాధుల ప్రభావం కాస్త ఆలస్యంగా ఆగస్టు రెండో వారంలో మొదలైంది.
ఇటీవల నాలుగు రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు వారం రోజులుగా అడపాదడపా వర్షాలు పలకరిస్తుండటంతో దోమల బెడద ఒక్కసారిగా పెరిగింది. వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండటంతో వీటికి అనుకూలంగా మారింది.
జిల్లాలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం, పెడన, కైకలూరు, గుడివాడ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు జ్వరలతో వణికిపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ మంచాలు పట్టారు.
ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ ప్రభావం పెద్దగా లేదని వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మలేరియా, డెంగీ కేసులు నమోదు కానప్పటికీ విషజ్వరాలు, టైపాయిడ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. వీటి బారిన పడిన ప్రజలు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కూడా పదిహేను రోజుల వరకు కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో గత 10 రోజుల నుంచి సిబ్బందితో ఇంటింటి సర్వే చేపడుతూ జ్వరపీడితుల వివరాలను సేకరిస్తున్నారు. పరిస్థితిని బట్టి ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహిస్తూ వైద్యసేవలు అందిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఉపకేంద్రాల్లో ఇప్పటికే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచారు. కొన్ని జిల్లాల్లో మందుల కొరత తలెత్తగా ఇక్కడ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు. రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం అవసరమైతే ఉన్నత వైద్యం నిమిత్తం ప్రాంతీయ వైద్యశాలలకు పంపిస్తున్నారు.
సంచార మలేరియా, డెంగీ చికిత్స కేంద్రాల ఆధ్వర్యంలో పట్టణ, పల్లెల్లో అవగాహన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మురికివాడలు, శివారు గ్రామాలు, తండాల్లో పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ శిబిరాల నిర్వహణను కొనసాగిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Tags: The bedrock sanitation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *