వరదలతో చదువుల ఆగమాగం

ఏలూరు ముచ్చట్లు:


గోదావరి వరద విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చేసింది. వరద ఉధృతికి విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో పాఠశాలల భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ముంపు బాధితులు గ్రామాలను ఖాళీ చేసి పునరావాస కాలనీల్లో తలదాచుకోవడంతో గడిచిన 20 రోజులుగా విద్యార్థులు చదువుకు దూరమ య్యారు. గ్రామాలకు ఎప్పుడు వెళ్తారో, విద్యార్థులు చదువు ప్రారంభించేదెప్పుడో తెలియని అయో మయం నెలకొంది. వేలేరుపాడు మండలంలో 54 పాఠశాలలు ఉండగా 2,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. గోదావరి వరదలకు గ్రామాలన్నీ ముంపునకు గురికావడంతో అక్కడి ప్రజలంతా పునరావాస కాలనీలకు చేరారు. వరదలకు పాఠశా లల భవనాలు సైతం నీట మునిగాయి. దీంతో పిల్లలు కూర్చునే బెంచీలు, విద్యార్థుల కోసం ఉపయోగించే ఇతర సామగ్రి, రికార్డులు మొత్తం దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కొయిదా, కట్కూరు, రుద్రమ్మకోట, రేపాకగొమ్ము, వేలేరుపాడు, నాగులగూడెం, ఎర్రబోరు వంటి పలు గ్రామాల్లోని రోడ్లు, ఇళ్లు బురదతో నిండిపోయాయి. దీంతో ఇప్పట్లో ఇళ్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామాల్లోని పాఠశాలలు సైతం తెరిచే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పటికీ వేలేరుపాడు మండలంలో 32 పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. కుక్కునూరు మండలంలో 65 స్కూల్స్‌ ఉండగా, 4,045 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ మండలంలోని గొమ్ముగూడెం, దాచారం ఎస్‌సి కాలనీ, కుక్కునూరు ‘ఎ’ బ్లాక్‌ కౌండిన్యముక్తి, మాధవరం గుప్ప, ఎల్లప్పగూడెం వంటి పలు గ్రామాలకు చెందిన దాదాపు రెండు వేల కుటుంబాలు ఇప్పటికీ రావికుంట, కివ్వాక, మర్రిపాడు, పుల్లప్పగూడెం, వెంకటాపురంలో నిర్మించిన నిర్వాసిత కాలనీల్లోనే ఉన్నారు. పలుచోట్ల పాఠశాలలు తెరిచినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అంతా పునరావాస కాలనీల్లో ఉండటంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కుక్కునూరు మండల కేంద్రంలోని హైస్కూల్లో 245 మంది విద్యార్థులు చదువుతున్నారు.

 

 

 

 

వరదకు స్కూల్లోని ఫర్నీచర్‌ మొత్తం దెబ్బతినడంతో ఇప్పటికీ హైస్కూల్‌ తెరవలేదు. రెండు, మూడు నెలలు విద్యార్థులు చదువుకు దూరమైతే ఈ విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో తమ పిల్లల చదువుల పరిస్థితి ఏమిటన్న బెంగ తల్లిదండ్రులను వేధిస్తోంది.వరదలకు కట్టుబట్టలతో అంతా పునరావాస కాలనీలకు చేరారు. గ్రామాలను వరద ముంచెత్తడం తో విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు తడిసి ఎందుకు పనికిరాకుండా పోయాయి. పాఠశాలల్లో రికార్డులు సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇంటిదగ్గర చదువు కునేందుకు సైతం పుస్తకాలు లేకుండా పోయాయి. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. వెంటనే విద్యార్థుల చదువులు కొనసాగేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

 

 

 


ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలు
 దాణా లేక ఆకలితో అలమటిస్తున్నాయి. లంకగ్రామాల్లో పశువుల పరిస్థితి దయనీయంగా మారింది. వరదలకు గడ్డిమేట్లు కొట్టుకుపోవడం, పచ్చగడ్డి కుళ్లిపోవడంతో పాడి పశువుల కడుపు నింపలేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం అరకొరగా దాణా పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. దీంతో పాల దిగుబడి దాదాపు ఆగిపోయింది పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట, నరసాపురం, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు ముఖ్యంగా పాడి పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ మూడు మండలాల్లో సుమారు 8,791 పశువులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 3,047 మంది పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. వరద తాకిడికి పాడి రైతులు భద్రపరుచుకున్న ఎండుగడ్డి కొట్టుకుపోయింది. పచ్చగడ్డి మడులు నీట మునిగాయి. రోజుల తరబడి నీటిలో ఉండిపోవడంతో పచ్చగడ్డి కుళ్లిపోయింది. ప్రభుత్వం పంపిణీ చేసిన సంపూర్ణ సమీకృత దాణా అరకొరగానే అందింది. ఈ దాణా తినేందుకు పశువులు విముఖత చూపుతున్నాయని రైతులు చెబుతున్నారు. పాడి పశువులకు దాణా లేకపోవడంతో పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. ‘గతంలో ఐదారు లీటర్ల పాలిచ్చే గేదెలు వారం రోజుల క్రితం వరకూ ఒకటి, రెండు లీటర్లకు మించి పాలు ఇవ్వలేదని, ప్రస్తుతం చుక్క పాలుకూడా ఇవ్వడం లేదని’ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల పాకలు నేలమట్టమవ్వడంతో ఎత్తయిన ప్రదేశాల్లో, ఏటిగట్లపై, రోడ్ల వెంబడి పశువులను ఉంచి రక్షించుకుటుంన్నారు.ఒక పశువుకు రోజుకు ఐదు కిలోల చొప్పున ఐదు రోజులకు 25 కిలోల దాణాను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 8098 పాడి పశువులకు 300 టన్నుల దాణాను ప్రభుత్వం అందించింది. వరదలు వచ్చి 20 రోజులు గడుస్తున్నాయి. ఐదు రోజులకు సరిపడా దాణానే ప్రభుత్వం అందించింది. లంక గ్రామాల్లో అటు ఎండుగడ్డి, ఇటు పచ్చగడ్డి లేకపోవడం, ప్రభుత్వం అందించిన దాణా సరిపోక మూగజీవాలు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంతంగా 330 కాపుల ఎండుగడ్డిని రైతులకు అందించారు.

 

Tags: The beginning of studies with floods

Leave A Reply

Your email address will not be published.