బెంచ్ నుంచి తప్పుకున్న ధర్మాసనం జస్టిస్‌ యు.లలిత్‌

The bench that left the bench was Justice U.Lalith

The bench that left the bench was Justice U.Lalith

Date:10/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
అయోధ్య వివాదంపై విచారణను మరోసారి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. రామమందిరం- బాబ్రీ మసీదు వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించింది. అయితే, ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్‌ యు.లలిత్‌ తప్పుకోవడంతో తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది.
గురువారం ఉదయం ఈ ధర్మాసనం వాదనలు ప్రారంభించింది. అయితే ఇందులో జస్టిస్‌ లలిత్‌ ఉండటంపై సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదం కేసులో యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ తరఫున జస్టిస్‌ లలిత్‌ వాదించారు. దీంతో ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్‌ సభ్యుడిగా ఉండటంపై ధవన్‌ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, అయోధ్య కేసులో జనవరి 29 నుంచి కొత్త ధర్మాసనం వాదనలు వింటుందని పేర్కొంది.అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులు, వివిధ సంస్థల తరఫున 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వ్యాజ్యాలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. 2019 జనవరి మొదటివారంలో విచారణ చేపడతామని గతేడాది అక్టోబరు 29న స్పష్టం చేసింది. విచారణ నిమిత్తం గత మంగళవారం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. అయితే, ఈ కేసుపై సత్వర విచారణ చేపట్టాలని, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయాలన్న విజ్ఞ‌ప్తుల‌ను గతంలో సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కానీ, అనూహ్యంగా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేసి ఆశ్చర్యానికి గురిచేసింది.
Tags:The bench that left the bench was Justice U.Lalith

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *