ఖమ్మంలో వేగంగా నీలి విప్లవం

Date:13/07/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లాలో 1162 చెరువులు ఉండగా నిరుడు 716 చెరువుల్లో 3.09 కోట్ల చేప పిల్లలను పోశారు. ఈ చేప పిల్లలను చెరువుల్లో పెంచడంతో జిల్లాలో సంవత్సరం మొత్తం 12 వేల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. మత్స్యకారులకు సుమారు రూ.10 కోట్ల ఆదాయం లభించింది. దీంతో వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లయింది. జిల్లాలో మొత్తం 177 మత్స్యకార్మిక సహకార సంఘాలు ఉండగా.. వీటిల్లో 25 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లోని సభ్యులంతా మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లాలోని 985 చెరువుల్లో ప్రభుత్వం 3.57 కోట్ల చేప పిల్లలను పోయనుంది. ఇప్పటికే జిల్లా మత్స్యశాఖ అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. నలుగురు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. ప్రధానంగా చెరువుల్లో బొచ్చ, రాహు, బంగారు తీగ, మ్రిగాల తదితర చేప పిల్లలను పోయనున్నారు. జిల్లాలోని పాలేరు, వైరా, లంకాసాగర్, బేతుపల్లి గంగారం రిజర్వాయర్లలో 13లక్షల రొయ్య పిల్లలను కూడా ఈ ఏడాది ప్రభుత్వం ఉచితంగా పోయనుంది. జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 195 చెరువులు ఉండగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 521 చెరువులు ఉన్నాయి. మిగిలిన చెరువలు ఇతర శాఖల పరిధిలో ఉన్నాయి. వాటిల్లో చేపల పెంపకానికి అనువైన చెరువులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. కాగా జిల్లాలో వైరాతోపాటు ఖమ్మంలో మత్స్య విత్తన క్షేత్ర కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలతోపాటు కాంట్రాక్టర్లు తాము లీజుకు తీసుకున్న పరిధిలో కూడా చేప పిల్లలను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం చెరువుల్లో పోసేందుకు రెండున్నర అంగుళాల పొడుగు ఉన్న చేప పిల్లలను కాంట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేయనున్నారు. మిగిలిన చెరువుల్లో ఒకటిన్నర అంగుళాల చేప పిల్లలను పోసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుడు జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు పోసేందుకు ప్రభుత్వం రూ.2.65 కోట్లు నిధులు కేటాయించటంతో సత్ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది రూ.3 కోట్లతో టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు.
ఖమ్మంలో వేగంగా నీలి విప్లవంhttps://www.telugumuchatlu.com/the-blue-revolution-in-khammam/
Tags; The blue revolution in Khammam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *