Natyam ad

సామాన్య భక్తుల సౌకర్యం కోసమే బ్రేక్‌ దర్శన సమయం మార్పు

– డిసెంబరు 17 నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

– డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుండి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసినట్టు టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. దీనివల్ల ఉదయం లభించే దాదాపు 3 గంటల సమయంలో సుమారు 15,000 మంది భక్తులకు అదనంగా సర్వదర్శనం కల్పించి వారికి వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకే ఈ ప్రణాళిక చేపట్టామన్నారు. భక్తులు ముందురోజు రావాల్సిన అవసరం లేకుండా అదేరోజు తిరుపతిలోనే బసచేసి, తిరుమలకు ఉదయం వచ్చి బ్రేక్‌ దర్శనం చేసుకోవచ్చన్నారు. ఇదివరకులా తిరుమలలో ముందురోజు బసచేయవలసిన అవసరం ఉండదని, తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి ఒక నెల తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 2న వైకుంఠ ఏకాదశి :

– జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి పది రోజులపాటు అంటే 11/01/2022 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.

– గత రెండు సంవత్సరాల మాదిరి ఈ సంవత్సరం కూడా రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తాం. దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

– అదేవిధంగా రోజుకు 50 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 5 లక్షల సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లను తిరుపతిలో కౌంటర్ల ద్వారా భక్తులకు మంజూరు చేస్తాం. ఈ సర్వదర్శనం టోకెన్లు ఎవరైనా క్యూలైన్లలో ఉండి పొందవచ్చును. వారికి లభించిన టైం మరియు తేదీ ప్రకారం దర్శనానికి రావచ్చు.
అనగా ప్రతిరోజూ 75 వేల దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

– దర్శన టికెట్‌ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్‌ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించడం సాధ్యం కాదు.

డిసెంబరు 17 నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై :

– డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభంకానుండడంతో డిసెంబరు 17వ తేదీ నుండి తిరుమల శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2023, జనవరి 14న ముగుస్తాయి.

ఆనందనిలయానికి బంగారు తాపడం :

– టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం.

– ఈ సమయంలో శ్రీవారి దర్శనం కొనసాగుతుంది. తాపడం కోసం భక్తులు సమర్పించిన బంగారాన్ని మాత్రమే వినియోగిస్తాం. ఈ సమయములో స్వామివారి దర్శనానికి 1957-58 సంవత్సరంలో టిటిడి అనుసరించిన విధానాన్నే అనుసరిస్తాం.

శ్రీవాణి దాతలకు మాధవంలో ఆఫ్‌లైన్‌ టికెట్లు :

– శ్రీవాణి ట్రస్టు దాతల కోసం డిసెంబరు 1 నుండి తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్లు కేటాయిస్తున్నాం. బస చేసేందుకు గదులు కూడా అక్కడే మంజూరు చేస్తున్నాం.

డిసెంబరు 4న భగవద్గీత అఖండ పారాయణం :

– గీతా జయంతిని పురస్కరించుకొని డిసెంబరు 4న ఆదివారం తిరుమల నాదనీరాజనం వేదికపై భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలను పండితులు నిరంతరాయంగా పారాయణం చేస్తారు. ఉదయం 7 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.

డిసెంబరు 5న చక్రతీర్థ ముక్కోటి :

– తిరుమలలో ప్రతి ఏడాదీ తమిళ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడి శ్రీ చక్రత్తాళ్వారుకు, శ్రీనరసింహస్వామి వారికి, శ్రీఆంజనేయస్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు.

డిసెంబరు 7న కార్తీక పర్వదీపోత్సవం :

– తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 7న కార్తీక పర్వదీపోత్సవం నిర్వహిస్తాం. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తరువాత ఆలయంలో కన్నులపండుగగా దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది.

శ్రీ శ్రీనివాస విశ్వశాంతిహోమం :

– మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో డిసెంబరు 12 నుండి 18వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వహిస్తాం.

భక్తులకు అందుబాటులో 2023 టిటిడి డైరీలు, క్యాలెండర్లు :

– టిటిడి ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి.

– తిరుమల, తిరుపతితోపాటు విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢల్లీి, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం.

పంచమితీర్థంనాడు విశేష సంఖ్యలో భక్తుల పవిత్రస్నానం :

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చివరిరోజు పంచమితీర్థం రోజున వేలాది మంది భక్తులు సేద తీరేందుకు జర్మన్‌ షెడ్లు, వారికి విరివిగా అన్నప్రసాదాలు, తాగునీరు, టి, పాలు తదితర ఏర్పాట్లు చేపట్టాం.

నవంబరు నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 22.77 లక్షలు.

హుండీ :

– హుండీ కానుకలు – రూ.127.31 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.03 కోట్లు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 43.13 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 8.91 లక్షలు.

 

Tags: The break darshan time has been changed for the convenience of common devotees

Post Midle