రైతన్నపై వడ్డీల భారం

హైద్రాబాద్  ముచ్చట్లు:
వానాకాలం సకాలంలోనే వచ్చిందన్న రైతన్న ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది. వానలు కురుస్తున్నా పెట్టుబడి అందక రైతన్న నానాతంటాలు పడుతున్నాడు. రుణమాఫీ, పావలావడ్డీ, వడ్డీలేని రుణాలు అందిస్తున్న సర్కారు మాటలు గాలి మూటలవుతున్నాయి. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ సర్కారే భరిస్తుందన్న హామీ అమలు కాలేదు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా పట్టాలెక్కలేదు. ఐదేళ్లుగా బ్యాంకులకు సర్కారు వడ్డీ చెల్లించకపోవడంతో ఆ భారమంతా రైతులపై పడుతోంది. ఐదేళ్ల కాలంలో సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులకు రూ 1000 కోట్లు సర్కారు చెల్లించాల్సి ఉంది. రుణం తీసుకున్న రైతుకు కొత్త రుణం ఇవ్వాలంటే వడ్డీ మెలిక పెడుతూ బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. దీంతో బ్యాంకులు కూడా చేసేదేమీ లేక అసలు, వడ్డీ కలిపి రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి.

వడ్డీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో అసలు చెల్లించినా…మిత్తి పేరుకుపోయి వడ్డీలేని రుణం, పావలావడ్డీ రుణాలకు అర్హత కోల్పోతున్నట్టు రైతులు వాపోతున్నారు. క్రమం తప్పకుండా రుణం చెల్లిస్తున్న రైతులకు సైతం బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లుగా బ్యాంకులకు వడ్డీ చెల్లించడం లేదు. సర్కారు తన వాటాను బ్యాంకుల్లో జమ చేయకపోవడంతో వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. 2015 – 16 నుంచి 2018 – 19 వరకు నాలుగేండ్లుగా రూ.810 కోట్ల పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల బకాయిలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించక పోగా రైతుల నుంచి బ్యాంకులు వసూలు చేసుకున్నాయి. గతేడాది (2019-20) సీజన్‌కు సంబంధించి మరో రూ.200 కోట్లకు పైగా వడ్డీ లేని రుణానికి వడ్డీ బకాయిలు ఉంటాయని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో ఈ ఐదేండ్ల్ల సమయంలో దాదాపు వెయ్యికోట్ల రూపాయల వరకు రాష్ట్రం తన వాటా చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. గత ఏడాది ఎస్‌ఎల్‌బిసి సమావేశంలో ఆర్థిక మంత్రి వడ్డీలేని, పావలావడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాదైనా అది అమలుకు నోచుకోలేదు.

 

కేంద్రం ఎంత ఇచ్చిందో లెక్కలు చెప్పండీ మా వాటా ఇస్తామని ఎస్‌ఎల్‌బిసిలో చెప్పి చేతులు దులుపుకున్నారే తప్ప ఇప్పటి వరకు వడ్డీపై సర్కారు దఅష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి.రైతుకు బ్యాంకులు వడ్డీలేని రుణాలు ఇస్తున్నా.. ఆ వడ్డీని ప్రభుత్వాలు చెల్లిస్తాయి. అందులో కేంద్రం వాటా 3 శాతం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వాటాను బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. రైతు తాను తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు చెల్లించాల్సిన వడ్డీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించడం ద్వారా రైతుకు వడ్డీ లేని రుణం అమలవుతున్నది. బ్యాంకర్లు కేంద్రం చెల్లించే వడ్డీ 3శాతాన్ని ఆర్‌బిఐ ద్వారా వసూలు చేసుకోవడం జరుగుతున్నది. మిగతా 4 శాతానికి సంబంధించి రాష్ట్ర సర్కారు ఐదేండ్లుగా చెల్లించడం లేదు. వడ్డీ సకాలంలో చెల్లిస్తే లక్ష రూపాయలదాకా వడ్డీలేని రుణం రైతులు పొందే అవకాశం ఉన్నది.రైతులు రూ 3లక్షల వరకు పావలా వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉంది. తీసుకున్న రుణాలు ఏడాది లోపే చెల్లిస్తే పావలా వడ్డీ అమలవుతుంది. 7 శాతం పావలా వడ్డీ రుణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతం, కేంద్రం 3 శాతం, రైతు 3 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆచరణలో మాత్రం వడ్డీ చెల్లిస్తే కొత్త రుణం ఇస్తామని బ్యాంకర్లు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 4 శాతం వడ్డీ బ్యాంకులు చెల్లించక పోవడంతో ఈ భారాన్ని బ్యాంకులు రైతులపై మోపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన తర్వాత జమ చేస్తామని చెప్పి రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్నామనే నెపంతో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను విస్మరిస్తుందన్న విమర్శలున్నాయి.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:The burden of interest on the farmer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *