చలి గుప్పిట్లోనే రాజధాని ప్రాంతం..
-ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు, రైళ్లు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణికిపోతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో వరుసగా ఐదో రోజూ అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీ సహా రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించింది. పంజాబ్ అంతటా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదిర ప్రాంతాలపై మంచు దుప్పటి కప్పేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఈ ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. లోధి రోడ్, ఆయానగర్, రిడ్జ్‌లో ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలు, 3.2 డిగ్రీలు, 3.3 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. దూరంలోని వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లోని రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఢిల్లీలో 40 మీటర్ల కంటే దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి. సఫ్దర్‌జంగ్ 25 మీటర్లు, పాలంలో 50 మీటర్ల కంటే దూరంలోని వాహనాలు కనిపించలేదని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు, నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Tags: The capital region is in the grip of cold.
