మండలి రద్దు దిశగా కేంద్రం అడుగులు

Date;27/02/2020

మండలి రద్దు దిశగా కేంద్రం అడుగులు

విజయవాడముచ్చట్లు: 

జగన్ సర్కార్ తన తొమ్మిది నెలల పాలనలో తీసుకున్న అత్యంత కీలకమైన, సంచలనమైన అంశం ఏదైనా ఉందంటే అది శాసనమండలి రద్దు. దాని మీద గత నెలలో శాసనసభను సమావేశపరచి మండలి రద్దు చేస్తూ ఒక్క దెబ్బతో జగన్ కధ ముగించేసారు. అయితే ఈ బిల్లు ఇపుడు ఢిల్లీకి చేరింది. కేంద్ర పెద్దలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారన్న డౌట్లు ఇప్పటికీ అందరికీ ఉన్నాయి. అయితే జగన్ ఈ మధ్య హస్తిన వెళ్ళి ప్రధాని మోడీని, అమిత్ షాను కలసి వచ్చాక అంతా అనుకూలంగా సాగుతుందని కూడా మాట వినిపించింది. ఇపుడు అదే నిజమయ్యేలా ఉంది. ఇప్పటికి ఢిల్లీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అన్ని రకాలా క్లియరెన్సులు చేయించుకుని మరీ ఈ బిల్లు వాయువేగంతో కేంద్ర మంత్రి మండలిలో చర్చకు వస్తున్నట్లుగా చెబుతున్నారు.ఈ బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడం అన్నది ఇపుడు లాంచనప్రాయమే అన్నది తెలిసిందే. జగన్ కోసం పూర్తిగా ఫేవర్ చేయాలని మోడీ, అమిత్ షా నిర్ణయించుకున్నారుట. అందుకే ఏ ఆటంకాలు లేకుండా ఈ బిల్లు ఇపుడు కేంద్ర మంత్రి మండలిలో చర్చకు వస్తోందని అంటున్నారు. అక్కడ బిల్లుని ఆమోదించి ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం అన్నది కేంద్రానికి ఉన్న బాధ్యత. దాన్ని వారు సవ్యంగా చేసేందుకు సమాయత్తమయ్యారని అంటున్నారు. మండలి రద్దు ని చేసి జగన్ కి కేంద్రం అనుకూలంగా ఉందని చెప్పుకోవాల‌న్నది మోడీ షా ఎత్తుగడగా చెబుతున్నారు.మండలి రద్దు వల్ల కేంద్రానికి పైసా కూడా ఖర్చు కాదు. లక్షల కోట్ల నిధులు ఏపీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే సమయంలో జగన్ కోరిన కోరికలు తీర్చామని చెప్పుకునేందుకు వీలు అవుతుంది. ఆ విధంగా జగన్ ని తమ వైపునకు తిప్పుకుంటే రేపటి రోజున రాజ్యసభలో ఆయన‌కు ఉన్న అరడజను మంది ఎంపీల మద్దతు కడు సునాయాసంగా పొందేందుకు వీలు అవుతుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. దాంతో మండలి రద్దు బిల్లుని చాలా వేగంగా ఆమోదించేందుకు రెడీ అవుతున్నట్లుగా భోగట్టా.ఇపుడు కేంద్రం దూకుడు చూస్తూంటే మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే మండలి రద్దు జరుగుతుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం జగన్ కి మహదానందమే. ఎందుకంటే ఆయన కూడా ఏపీలో బడ్జెట్ సమావేశాలు పెట్టాలని భావిస్తున్నారు. పెడితే మండలిని కూడా తెరిపించి అక్కడా చర్చలు జరపాలి. కానీ మండలి ముఖం చూడనని జగన్ గట్టిగా భావిస్తున్న నేపధ్యంలో ఆయన పంతం నెరవేరేలా సత్వరమే కేంద్రం నిర్ణయం తీసుకుంటే జగన్ ఏపీలో మొనగాడే అవుతాడు. నాడు ఎన్టీయార్ మాదిరిగా తన ప్రతిన నెరవేర్చుకుని అసెంబ్లీలోనే అధిక బలంతో పాలన చేసేందుకు వీలు అవుతుంది. ఇక అధికార వికెంద్రీకరణ బిల్లు కూడా సునాయాసంగా ఆమోదం పొంది విశాఖ పాలనా రాజధానిగా మారేందుకు కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అంటున్నారు. మొత్తానికి కేంద్రం జగన్ కోరికను తీర్చే పనిలో బిజీగా ఉందని ఢిల్లీ టాక్.

 

Tags;The center steps towards the dissolution of the council

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *