రోజుకో మలుపు తిరుగుతున్న కోడి కత్తి వివాదం

-డైలీ ఎపిసోడ్ ను తలపిస్తున్న హత్యాయత్నం కేసు
Date:10/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్య వివాదాస్పదంగా మారిన కోడి కత్తి వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చి ఎన్నికల ప్రయోజనాలను నొల్లుకోవాలనే దిశలో ఇరుపార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాజకీయ బాధిత పాత్రలోకి మారడం ద్వారా ప్రజల సానుభూతిని ఓట్ల రూపంలో కొల్లగొట్టాలని కొత్త ఎత్తులు వేస్తున్నాయి. తెలుగుదేశం అధికార పార్టీగా ఉండి తమ బాధ్యతను విస్మరిస్తోంది.
వైసీపీ ఉన్న విషయాన్ని పెద్దది చేసి చూపడం ద్వారా రాజకీయాన్ని రంజుగా మార్చాలని చూస్తోంది. మొత్తం ఉదంతంలో సీరియస్ నెస్ పోయింది. ప్రజల దృష్టిలో వినోద కార్యక్రమంగా, రాజకీయ క్రీడగా రంగులు మారుతోంది. ప్రతిపక్ష నాయకునిపై దాడి చిన్న విషయం కాదు. శాంతిభద్రతల కోణంలో చాలా పెద్దదే. అదే సమయంలో భద్రతా వ్యవస్థ ప్రతిష్టనే నడిరోడ్డుమీదకు ఈడ్చేంత పెద్ద విషయమూ కాదు. ఎన్నికల ముంగిట్లో ప్రవేశిస్తుండటంతో ప్రతి విషయమూ రాజకీయ మయం అయిపోతోంది. అందులో ఇదొక భాగం మాత్రమే .
రాష్ట్రప్రభుత్వం పై విశ్వాసం లేదు. ప్రత్యేక విచారణ చేయాలి. అందుకుగాను సీబీఐకి అప్పగించాలం’టూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వైసీపీ. మూడు రకాలుగా పిటిషన్లు దాఖలు చేసింది. గతంలో సీబీఐని తీవ్రంగా అధిక్షేపించింది వైసీపీ. తమపై రాజకీయ అస్త్రంగా దానిని ప్రయోగించారంటూ వాపోయింది. అదే సీబీఐ ఈరోజున కావాల్సి వచ్చింది. తమ అధినేతపై జరిగిన దాడి లోతుపాతులను తేటతెల్లం చేయడానికి విచారణ జరపాలని డిమాండు చేస్తున్నారు. దీనికి కొంత రాజకీయ ప్రాతిపదిక కూడా ఉంది. సీబీఐ ముఖ్యమంత్రి సహా ఎవరినైనా విచారించగలుగుతుంది. శాంతిభద్రతలు రాష్ట్రప్రభుత్వ అంశం.
అందువల్ల సాధారణంగా రాష్ట్రం కోరితే మాత్రమే సీబీఐ రంగప్రవేశం చేస్తుంది. లేదంటే హైకోర్టు,సుప్రీం కోర్టు న్యాయపరంగా ఉత్తర్వులిచ్చినా సీబీఐ విచారణ చేపడుతుంది. అందుకు రాష్ట్రప్రభుత్వ అనుమతితో నిమిత్తం ఉండదు. ప్రస్తుతం ఈరకమైన ఉత్తర్వు తెచ్చుకోగలిగితే టీడీపీకి చుక్కలు చూపించవచ్చని వైసీపీ భావిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఒక లక్ష్యమైతే, విచారణలోని ప్రతిఘట్టాన్ని పొలిటికల్ పాయింట్ గా మలచుకోవచ్చుననేది మరో లక్ష్యం.
ముఖ్యమంత్రి సహా పలువురి పై అభియోగాలు మోపుతూ విచారణ ప్రక్రియ మొత్తాన్ని వైసీపీ ప్రచారానికి అనువుగా మలచుకోవచ్చుననేది యోచన.దర్యాప్తు సంస్థలను, న్యాయవ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకోసం వినియోగించుకోవాలనే యావ బాగా పెరిగిపోయింది. గతంలో జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా హవా చెలాయిస్తున్న రోజుల్లో సీబీఐ రూపంలో బ్రేకులు పడ్డాయి. 16 నెలల పాటు విచారణను ఎదుర్కొంటున్న నిందితునిగా జైలు జీవితం గడిపాడు. పొలిటికల్లీ మోటివేటెడ్ పిటిషన్ ఇందుకు కారణం. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెసు నేరుగా జగన్మోహన్ రెడ్డిపై చర్య తీసుకోవడానికి సాహసించలేదు.
ఆయనపై కేసులు నమోదు చేస్తే తమకు ప్రతికూలంగా పరిణమిస్తుందని భయపడింది. అందుకే తమ పార్టీకి చెందిన వ్యక్తి చేతనే న్యాయస్థానంలో పిటిషన్ వేయించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు రప్పించుకొంది. విచారణకు ఆటంకం కలగకూడదంటూ జగన్ మోహన్ రెడ్డి ని జైలు పాలు చేశారు. సాక్షులను ప్రభావితం చేస్తాడనే సాకును చూపించారు.
2014లో వైసీపీ అధికారంలోకి రాకుండా పోవడానికి ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. నిరంతరం విచారణతో నేరం నిరూపితం కాకముందే జగన్ పై అవినీతిపరుడున్న ముద్ర బలంగా పడటానికి సీబీఐ దర్యాప్తు కొలబద్దగా మారింది. దాంతో మధ్యతరగతి, మేధో వర్గాలు కొంతమేరకు జగన్ కు దూరమయ్యాయి. కోడికత్తితో దాడిని ఆసరా చేసుకుంటూ ప్రస్తుతం తెలుగుదేశంలో కీలక నాయకులను బజారుకు లాగగలిగితే ప్రయోజనం ఉంటుందనేది వైసీపీ యోచన.ప్రత్యర్థిని ఏరకంగా ఇబ్బంది పెట్టగలమన్న ఆలోచన తప్పితే సీరియస్ గా ఈ కేసును రెండు పార్టీలు పట్టించుకోవడం లేదు.
కోట్లాది మంది ఆదరణ పొందిన జగన్ మోహన్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందేమోనని శాంతిభద్రతల యంత్రాంగం భావించడం లేదు. తమ తలకు చుట్టుకుంటుందేమోనన్న ఆందోళన టీడీపీలోనూ లేదు. తమ నాయకుడిపై దాడిని తీవ్రంగా చూసేంత ఓపిక, తీరిక వైసీపీలో లేవు . ఒకవేళ అదే ఉంటే, సొంత భద్రతను పటిష్ఠం చేసుకోవడమూ ,పోలీసులను ఆశ్రయించడం వంటివి సాగుతుండేవి. ఆంధ్రా పోలీసులను నమ్మడం లేదని బహిరంగంగా ప్రకటన చేయడం నష్టపూరితమైన చర్య. తద్వారా పోలీసులు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడింది.
సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం అంగీకరిస్తుందో లేదో తెలియదు. ఈలోపుగానే వైసీపీ అనేక తప్పులు చేస్తూతమ మీద రావాల్సిన సింపతీని శూన్యం చేసేసుకుంటోంది. తాము దోషులం కాదని చెబితే చాలు టీడీపికి సరిపోతుంది. కానీ మొత్తం వివాదాన్ని సొంతం చేసుకుంటోంది. ఫలితంగా టీడీపీకి రాజకీయంగా డ్యామేజీ జరుగుతోంది. ఈరకంగా రెండు పార్టీలు ప్రజల్లో పలచన అవుతున్నాయి.
Tags: The chicken knife controversy is turning into a day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *