సీఎం పర్యటనతో బాధితులకు వొరిగిందేమీ లేదు

విజయవాడ ముచ్చట్లు
ఒక్క రూపాయి ఆర్థిక సాయం ఏదీ

పోలవరం ముంపు బాధితులకు న్యాయం చేయరా?

పరామర్శించి చేతులు దులుపుకున్నారు
పోలవరం పై కావాలనే కేంద్రం వివక్ష

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటనతో బాధితులకు వొరిగిందేమీ లేదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆరోపించారు. పోలవరం ముంపు ప్రాంతాల బాధితులకు పరిహారం, పునరావాసం విషయంలో సీఎం స్పష్టమైన ప్రకటన చేయలేదని విమర్శించారు. ఒక్క రూపాయి ఆర్థిక సాయం ప్రకటించకుండా ముద్దులు, ఆశీర్వాదాలతో ప్రజలకు ఏం ప్రయోజనమేమి ఆయన ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం ప్రశ్నార్థకంగా మార్చిందని ద్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనిపూర్తి, నిర్వాసితులకు పరిహారం విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని జగన్ మోహన్ రెడ్డి నీరుగారుస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుగా మారుతుందా లేక బ్యారేజిగానే మిగిలిపోతుందా అనేది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు సాధించటం జగన్మోహన్ రెడ్డికి చేతకాదా అని నిలదీశారు. చేత కాకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించేయాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే పోలవరం ప్రాజెక్టు పై వివక్ష చూపుతోందని విమర్శించారు.

గోదావరి వరదల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు, పునరావాసం, ఆహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని శైలజనాథ్  విమర్శించారు. తక్షణం కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేసి బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, కనీసం కేంద్ర బృందాలు కన్నెత్తి చూడలేదని తెలిపారు. వరదల ఉధృతికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ స్పందన లేదన్నారు. డెల్టాలోని లంక గ్రామాలు, పోలవరం పరిధిలోని ఏడు మండలాల పరిస్థితి ఘోరంగా ఉందని తెలిపారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో ఇటీవల పర్యటించామని, అక్కడ కనీసం బాధితులకు ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు.

పెదమల్లంలంక, భీమలాపురం, కాపులపాలెంలో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ఇక్కడ వరద తగ్గడంతో పునరావాస కేంద్రాలను ఎత్తివేశారని, బాధితుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రం  వరద బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టలేదని శైలజనాథ్ విమర్శించారు. పండ్లు, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. లంక భూముల్లో జరిగే పంట నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ఇవ్వడం లేదని, నష్టపోయిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కౌలుదారులకు కూడా నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

గోదావరి వరదలకు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఏడువేల ఇళ్లు దెబ్బతిన్నట్లు లెక్కలు తేలాయని, ఇందులో పూర్తిగా నేలమట్టమైనవే అధికంగా ఉన్నాయని, గోదావరి వరదలు సృష్టించిన బీభత్సంతో వేల కుటుంబాలకు నిలువ నీడ లేకుండాపోయిందన్నారు. దీంతో బాధితులు పునరావాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: The CM’s visit did not help the victims…

Leave A Reply

Your email address will not be published.