బిహార్‌లో కేవలం 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం దేశవ్యాప్తంగా చర్చ

బిహార్‌ ముచ్చట్లు:

 

బిహార్‌లో కేవలం 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెనలు స్వల్ప వ్యవధిలోనే ఇలా కుప్పకూలుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్‌ స్పందించారు. వంతెనల పూడిక తీత పనులను దక్కించుకున్న గుత్తేదారులు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లే ఈ ఘటనలకు కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. పట్నాలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గుత్తేదారుకు అప్పగించిన పనులను సరిగా నిర్వర్తించలేదని, అదే సమయంలో ఇంజినీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా సరన్‌ జిల్లాలో భారీ వంతెన కూలిపోయింది. గత 17 రోజుల వ్యవధిలో ఇది పన్నెండోది. గతంలో శివన్‌, సరన్‌, మధుబాణి, అరారియా, ఈస్ట్‌ చంపారన్‌, కృష్ణగంజ్‌ జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. ‘‘జులై 3, 4 తేదీల్లో శివన్‌, సరన్‌ జిల్లాల్లోని గండక్‌ నదిపై నిర్మించిన ఆరు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే పూడికతీత సమయంలో ఇంజినీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అదే సమయంలో గుత్తేదారు కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని తెలుస్తోంది. ఈ ఘటలకు ఆయా ఇంజినీర్లే ప్రధాన బాధ్యులు. నిపుణుల బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించాం. శుక్రవారానికల్లా నివేదిక పంపాలని ఆదేశించాం’’ అని చైతన్య ప్రసాద్‌ మీడియాకు తెలిపారు.దీనిపై బిహార్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందని విలేకరులు ప్రశ్నించగా.. వాటి స్థానంలోనే కొత్త వంతెనలు నిర్మిస్తామని, ఆ భారాన్ని గుత్తేదారుపైనే మోపుతామని అన్నారు. ఇటీవల కూలిపోయిన వంతెనలన్నీ దాదాపు 30 ఏళ్ల క్రితం నాటివని, పునాదులు లోతుగా లేకపోవడంతో పూడిక తీత సమయంలో దెబ్బతిని కూలిపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 30ఏళ్లకు పైబడిన అన్ని వంతెనలను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేస్తామని చెప్పారు.బిహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోవడం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సీఎం నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. ‘‘జూన్‌ 18 నుంచి ఇప్పటి వరకు 12 వంతెనలు కూలిపోయినా ప్రధాని మోదీ గానీ, ముఖ్యమంత్రి నీతీశ్‌ గానీ పెదవి విప్పలేదు. ఇప్పుడు అవినీతి రహిత ప్రభుత్వానికి ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవినీతి ఎంతలా రాజ్యమేలుతోందో చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శనం’’ అని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. మరోవైపు, రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలపై సర్వే నిర్వహించి, తగిన మరమ్మతులు చేయాలని సీఎం నీతీశ్‌ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం చౌదరి తెలిపారు. వంతెనల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని సూచించినట్లు తెలిపారు. తాజా ఘటనలపై వెంటనే దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చౌదరి మీడియాకు తెలిపారు.

 

 

Tags:The collapse of 12 bridges in Bihar in just 17 days is the talk of the country

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *