-సీఎం రాజీనామా చేసే అవకాశం..!
Date:21/02/2021
యానాం ముచ్చట్లు:
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు శాసససభ్యులు పదవులకు రాజీనామాలు సమర్పించగా.. ఆదివారం మరో ఎమ్మెల్యే సీఎంకు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్లు లక్ష్మీనారాయణన్ ప్రకటించారు. బలపరీక్షకు ముందే ఆయన వైదొలగడం కలకలం రేపుతోంది. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగించాలని, విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలని తమిళసై పేర్కొన్నారు.
కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అధిపక్షం వైపు కేవలం 9 మంది మాత్రమే మిగిలిపోయారు. అయితే ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది. దీంతో అసెంబ్లీ బలపరీక్షకంటే ముందే నారాయణస్వామి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. బలపరీక్ష నిర్వహించిన సరిపడ బలం లేకపోవడంతో ముందుగానే రాజీనామాను సమర్పిస్తారని తెలుస్తోంది.
పుంగనూరులో చట్టాలపై అవగాహన అవసరం – న్యాయమూర్తి బాబునాయక్.
Tags: The Congress government in the crisis of MLA resignation before the coup