ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసింది

-సరైన విధంగా విభజన జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు
-పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, బిల్లును ఆమోదించారు
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
 
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
 
ఆంధ్ర ప్రదేశ్ విభజన వల్ల ఏర్పాటైన రెండు రాష్ట్రాలు ఇప్పటికీ కష్టాల్లోనే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ మంగళవారం రాజ్యసభలో సమాధానమిస్తూ కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఉనికిలో ఉండటం వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను కాంగ్రెస్ హడావిడిగా విభజించిందన్నారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయమని వ్యాఖ్యానించారు. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ, ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావు లేని రీతిలో, శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సరైన విధంగా విభజన జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, బిల్లును ఆమోదించారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. విభజన తీరుతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు.
 
Tags; The Congress has done a lot of injustice to the joint Andhra Pradesh

Leave A Reply

Your email address will not be published.