అంతుపట్టని రఘరాముడి ఆంతర్యం

-ఆచితూచి వ్యవహరిస్తున్న కమలం

Date:02/07/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఒక‌వైపు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను త‌మ‌వైపు చేర్చుకుంటూ, వారి కీర్త‌న‌లు పొందుతున్న వైసీపీకి ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ ఇస్తున్న వ‌రుస షాక్‌లు ఇబ్బందిక‌రంగా మారాయి. వైసీపీ ప్ర‌భుత్వం ప‌నితీరును ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శిస్తే స‌మాధానం చెప్పుకోవ‌చ్చు కానీ సొంత ఎంపీనే బాహాటంగా విమ‌ర్శిస్తుండ‌టంతో వైసీపీకి ఎలా స‌మాధానం చెప్పుకోవ‌లో దిక్కుతోచ‌డం లేదు. పార్టీకి, జ‌గ‌న్‌కు విధేయుడినే అని ఒక‌వైపు చెప్పుకుంటూనే మ‌రోవైపు వైసీపీకి ఇబ్బంది క‌లిగేలా ఆయ‌న వ్య‌వ‌హరిస్తున్నారు.

 

 

ఛాన్స్ దొరికితే ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టాల‌ని, విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టాల‌ని భావిస్తున్న వైసీపీ వ్య‌తిరేక మీడియాకు ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణంరాజు ఒక అస్త్రంలా మారారు. ఆయ‌న వ్య‌వ‌హారాన్ని బాగా హైలెట్ చేస్తూ 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీల‌తో తిరుగులేని పార్టీగా క‌నిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లుక‌లుక‌లు ఉన్నాయ‌నే ప్ర‌చారాన్ని వైసీపీ వ్య‌తిరేక మీడియా పెద్ద ఎత్తున చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక ర‌ఘురామ‌కృష్ణం రాజు వ్య‌వ‌హారంలో తాడోపేడో తేల్చేయాల‌ని వైసీపీ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఆయ‌న‌కు ఇప్ప‌టికే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ విజ‌య‌సాయిరెడ్డి పేరుమీద షోకాజ్ నోటీసు వెళ్లింది.
కాగా, అస‌లు ర‌ఘురామ‌కృష్ణంరాజుకు పేచీ ఉన్న‌దే విజ‌య‌సాయిరెడ్డితో అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా, వైసీపీలో నెంబ‌ర్ 2గా చ‌క్రం తిప్పుతున్న ‌విజ‌యసాయిరెడ్డితో ర‌ఘురామ‌కృష్ణంరాజుకు పొస‌గ‌డం లేద‌నేది బ‌హిరంగ‌మే. అటువంటిది విజ‌య‌సాయిరెడ్డి పేరు మీదే షోకాజ్ నోటీసులు రావ‌డంతో ఆయ‌నకు మ‌రింత కోపం వ‌చ్చింది.దీంతో వెట‌కారాన్ని జోడించి, నోటీసులో లోపాలు వెతికి షోకాజ్ నోటీసులే త‌ప్పు అనే కొత్త వాద‌నను తెర‌పైకి తెచ్చారు.

 

 

 

అంతేకాదు, వైసీపీ పేరులో ఉన్న గంద‌ర‌గోళాన్ని తెరపైకి తీసుకొచ్చి అస‌లు పార్టీ పేరు, షోకాజ్ నోటీసు ఇచ్చిన పార్టీ పార్టీ వేరు అనే వాద‌న‌ల‌కు ర‌ఘురామకృష్ణంరాజు దిగారు. దీంతో ఆయ‌న వ్య‌వ‌హారాన్ని ఏం చేయాలో వైసీపీ పెద్ద‌ల‌కు అర్థం కావ‌డం లేదు.అయితే వైసీపీలో అసంతృప్త నేత‌గా ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు ఒంట‌రిగా మిగిలిపోయారు. ఆయన వెంట వైసీపీ నేత‌లు ఎవ‌రూ లేరు. న‌ర్సాపురం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారారు. ఆయ‌న దిష్ట‌బొమ్మ‌లు ద‌హ‌నం చేయించే వ‌ర‌కు గొడ‌వ వెళ్లింది. ఇది కూడా ర‌ఘురామ‌కృష్ణంరాజుకు కోపం తెప్పించింది. దీంతో ఆయ‌న కూడా ఎంత‌దూర‌మైనా వెళ్లి వైసీపీతో తాడోపేడో తేల్చుకోవాల‌ని భావిస్తున్నారు. బీజేపీ పెద్ద‌లు, కేంద్రమంత్రుల‌తో త‌న‌కు ఉన్న సంబంధాల‌ను ఉప‌యోగించుకొని వైసీపీని ఇరుకున పెట్టాల‌ని అనుకుంటున్నారు.

 

 

 

 

ఇప్ప‌టికే కేంద్ర‌మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, ప్ర‌హ్లాద్ జోషి, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి ఎంపీగా ఉన్న త‌న హ‌క్కుల‌కు వైసీపీ నేత‌లు భంగం క‌లిగిస్తున్నార‌ని, త‌న‌కు భ‌ద్ర‌త లేద‌ని ఫిర్యాదు చేసి వ‌చ్చారు.త‌మ పార్టీ గుర్తుపై గెలిచిన ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌మ పార్టీనే ఢిల్లీ స్థాయిలో బ‌ద‌నాం చేయ‌డాన్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. ఆయ‌న ఎంపీ ప‌ద‌విపైనే వేటు వేయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నట్లు తెలుస్తోంది.ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. ఒక్క ఐదు నిమిషాలు త‌న‌కు జ‌గ‌న్ స‌మ‌యం ఇప్పిస్తే చాల‌ని ర‌ఘురామకృష్ణంరాజు ప‌దేప‌దే కోరుతున్నా జ‌గ‌న్ మాత్రం ఆయ‌న‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ఇష్టంగా లేరు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పైన ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎంపీ ప‌ద‌విపై అన‌ర్హ‌త వేటు వేయించే దిశ‌గా వైసీపీ ఆలోచ‌న‌లు సాగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.అయితే, ర‌ఘురామకృష్ణంరాజు చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

 

 

పార్టీని ఆయ‌న వ్యాఖ్య‌లు ఇబ్బంది పెడుతున్నా అవి పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌లుగా వైసీపీ నిరూపించే అవ‌కాశాలు లేవు. ఆయ‌న ఏ ఇత‌ర పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన‌డం లేదు.పైగా ప‌దే ప‌దే వైసీపీ, జ‌గ‌న్ విధేయుడిని అని చెబుతున్నారు. వైసీపీ ప్ర‌య‌త్నాల‌కు ర‌ఘురామ‌కృష్ణంరాజు చిక్కె అవ‌కాశాలు అయితే లేవు. అయితే, కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను ర‌ఘురామకృష్ణంరాజు క‌ల‌వ‌గానే వైసీపీ ప్ర‌తినిధిగా ఆ పార్టీ ఢిల్లీ వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా ఉండే మ‌రో ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరిని వైసీపీ ఢిల్లీ పంపింది. ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌లిసి ఫిర్యాదు చేసిన పెద్ద‌ల‌నే బాల‌శౌరి క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.ర‌ఘురామ‌కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూర‌మైన‌ట్లు లెక్క‌. ఆయ‌న కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపు చూస్తున్నారు. త‌న ప‌రిచ‌యాల‌ను ఉప‌యోగించుకొని వైసీపీని ఇరుకున పెడుతున్నారు.

 

 

 

అయితే, బీజేపీ ఆయ‌న‌ను నేరుగా పార్టీలో చేర్చుకునే అవ‌కాశాలు, ర‌ఘురామకృష్ణంరాజుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు కూడా లేవు.వైసీపీతో బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజ్య‌స‌భ‌లో బ‌లం పెంచుకుంటున్న వైసీపీ అవ‌స‌రం బీజేపీకి ఉంది. రాష్ట్ర స్థాయి రాజ‌కీయాలు ఎలా ఉన్నా కేంద్ర బీజేపీకి, వైసీపీకి మాత్రం స‌ఖ్య‌త ఉంది. ఇప్పుడు ఒక్క ర‌ఘురామ‌కృష్ణంరాజు కోసం వైసీపీకి వ్య‌తిరేకంగా బీజేపీ వెళ్ల‌డం అనుమాన‌మే. మొత్తంగా ర‌ఘురామ‌కృష్ణంరాజు కొన్ని రోజుల పాటు వైసీపీ వ్య‌తిరేక మీడియాలో, ఢిల్లీలో హాల్‌చ‌ల్ చేసినా ఆయ‌న అంతిమంగా ఏం సాధిస్తార‌నేది చూడాల్సి ఉంది. వైసీపీకి ఇక ఆయ‌న ద‌గ్గ‌ర‌కావ‌డం జ‌ర‌గ‌ని ప‌నిలా క‌నిపిస్తోంది. బీజేపీ ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌కు చేర్చుకునే అవ‌కాశాలు కూడా ఇంచుమించు లేవు.

పోలీసులే ఆప్తులై… అంత్యక్రియలు

Tags: The cops are … the funeral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *