Applications in the Layout, which is named after Corona

కరోనా బండ పడింది

Date:14/07/2020

నల్గొండ ముచ్చట్లు:

రంగు రంగుల పట్టు వస్త్రాలను నేసే నేతన్నల పరిస్థితి కరోనాతో తారుమారవడంతో వారి జీవితాల్లో రంగులు కోల్పోయి చీకటి కమ్ముకుంటున్నది. చేనేతను కరోనా కుదేలు చేసి ఉపాధిని ఊడ్చేసింది. రూ.200 కోట్ల వస్త్ర నిల్వలు పేరుకుపోయి ఇరవై వేల మగ్గాలకు పగ్గాలేసింది. దాంతో రెక్కాడితేగాని డొక్కాడని యాదాద్రిభువనగిరి జిల్లాలో పోచంపల్లితో పాటు నేతకార్మికులంతా నేడు వ్యవసాయ, ఉపాధి, భవన నిర్మాణ రంగాల్లో కూలీల అవతారమెత్తారు. కొనుగోళ్లు, రవాణా లేక పేరుకుపోయిన నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.ఇక్కత్‌ పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో ఐదువేల మందికి జీవనాధారమైన మగ్గం చప్పుళ్లు కరోనా దెబ్బకు మూడు నెలలుగా మూగపోయాయి. ఏప్రిల్‌, మే నెలల్లో పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో జనవరి నుంచే మాస్టర్‌ వీవర్స్‌ ఉత్పత్తులను సిద్ధం చేయిస్తారు. కానీ, కరోనాతో వివాహాది శుభకార్యాలన్నీ నిలిచిపోవడంతో వస్త్ర వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. 2019 డిసెంబర్‌ నాటికి ఉత్పత్తి చేసిన సరుకు నిల్వలే ఇంకా ఉన్నాయి.

 

 

రోజుకు రూ.రెండున్నర కోట్ల వ్యాపారం జరిగే పోచంపల్లిలో అమ్మకాలు జరగక, కొత్త ఆర్డర్లు వచ్చే పరిస్థితి లేకుండా పోవడం వల్ల సహకార, సహకారేతర పరిధిలో మగ్గాలన్నీ మూలనపడ్డాయి. భద్రావతి కాలనీ, రాజీవ్‌నగర్‌ కాలనీ, మార్కండేయ కాలనీలోని వెయ్యి మందికి పైగా నేత కార్మికులు కుటుంబపోషణ కోసం వ్యవసాయ, ఉపాధి, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌, గట్టుప్పల, పుట్టపాక, సిరిపురం, వెల్లంకి, కొయ్యలగూడెం, రాజపేట, బోగారం, గుండాల, ఆత్మకూర్‌(ఎం), ఆలేరు సిల్క్‌నగర్‌లో నాలుగు వేలకు పైగా మగ్గాలు మూలకు పడడంతో ఐదారు వేల మందికి పైగా నేతన్నలు కూలీలుగా మారారు. ఇక చేనేతపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన మరో 40వేల మందికి పనిలేక కుటుంబపోషణ కోసం కూలీలుగా మారిన పరిస్థితి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మగ్గాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్న చేనేత పరిశ్రమ భవితవ్యాన్ని కరోనా (లాక్‌డౌన్‌) చిన్నాభిన్నం చేసింది.పోచంపల్లి సహకార సొసైటీ పరిధిలో 919 మంది సభ్యులున్నారు. వీరి వద్ద సుమారు రూ.1.30 కోట్ల విలువైన చీరలున్నాయి. సహకారేతర పరిధిలో ఉన్న ఆన్‌లైన్‌ అమ్మకాలు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసే మాస్టర్‌ వీవర్స్‌ వద్ద దాదాపు రూ.80 కోట్ల విలువైన పట్టు వస్త్రాలు పేరుకుపోయాయి. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న వీరు ఒక్కో చీరపై రూ.వెయ్యి డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించారు.

 

 

 

అయినప్పటికీ అమ్మకాలు లేకపోవడంతో దిగాలు పడుతున్నారు.2001లో చేనేత రంగానికి ఇదే తరహా సంక్షోభం వచ్చిన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆప్కో ఫ్యాబ్రిక్స్‌ ద్వారా రూ.12 కోట్ల విలువైన మొత్తం సరుకును కొనుగోలు చేయించారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, జనగామ జిల్లాల్లో తొమ్మిది వేల మగ్గాలపై నేసిన ఇక్కత్‌ పట్టు వస్త్రాలు రూ.200 కోట్ల మేర పేరుకుపోయాయి. ఇందులో నల్లగొండ పరిధిలో రూ.80 కోట్ల విలువైన ఇక్కత్‌ పట్టు చీరలు, కాటన్‌ చుడిదార్లు, లుంగీలు, టవల్స్‌, బెడ్‌షీట్స్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌, జనగామ, మహబూబ్‌నగర్‌లో హైదరాబాద్‌ పివిటి మార్కెట్‌ కేంద్రంగా మాస్టర్‌వీవర్స్‌ నేయించిన సుమారు రూ.120 కోట్ల విలువైన పట్టు వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. వీటిన్నింటిని ఇప్పుడు సిఎం కెసిఆర్‌ టెస్కో ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తప్ప చేనేత మనుగడ సాధించడం కష్టమని నేతన్నలు అభిప్రాయపడుతున్నారు.

జూలై 15 నుండి విరాటపర్వం పారాయ‌ణం

Tags: The corona fell off the cliff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *