Natyam ad

ఖర్చే మిగిలింది.

-మునుగోడులో ఇద్దరిదీ ఒకే మాట

నల్గోండ ముచ్చట్లు:

మునుగోడు అత్యంత ఖరీదైన ఎన్నికగా చరిత్ర సృష్టించబోతున్నదని తెలుగువన్ ముందుగానే చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. ఎన్నికల వ్యయం విషయంలో మునుగోడు ఉప ఎన్నిక గత రికార్డులన్నీ చెరిపేసింది. డబ్బు మద్యం యథేచ్ఛగా ప్రవహించాయి. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అప్పటికి రికార్డు.. మునుగోడు ఉప ఎన్నిక ఆ రికార్డును తిరగరాసింది.
మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పది వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించింది. విజయంపై ధీమాతో ఉన్న బీజేపీ చతికిల పడింది. కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాక తన పతనావస్థను మరింత సుస్థిర పరుచుకుంది.  మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అని స్పష్టమైన క్షణం నుంచీ ఆ నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఏరులై ప్రవహించాయి. ఆగస్టు నెలలోనే చుండూరు, నాంపల్లి, రామన్న పేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిథిలో లక్షా పదకొండు వేల 279 కేసుల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఆ తరువాత ఉప ఎన్నిక పోలింగ్ వరకూ అంతకు ఎన్నో రెట్ల కేసుల మద్యం విక్రయాలు జరిగాయని పరిశీలకులు లెక్కలు చెబుతున్నారు. ఇక డబ్బు అయితే చెప్పనే అక్కర్లేదు. నియోజకవర్గంలో గెలవడం కోసం అధికార తెరాస ఓటుకు ఐదు వేలు చొప్పున పంచిందని చెబుతున్నారు. అయితే ఒక్కో ఏరియాలో ఇది పది వేలు కూడా దాటిందన్న సమాచారమూ ఉంది. ఇక బీజేపీ కూడా ఏ మంత తక్కువ తినలేదు..

 

 

Post Midle

ఆ పార్టీ కూడా ఓటుకు నాలుగువేల రూపాయల చొప్పున పంచిందని చెబుతున్నారు. వాస్తవానికి అంత కంటే ఎక్కువే పంచిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోనే.. కాదు దేశ వ్యాప్తంగా కూడా అత్యంత ఆసక్తికరమైన ఉప ఎన్నికగా గుర్తింపు పొందిన మునుగోడు  ఉప ఎన్నిక పూర్తయ్యింది. ఫలితం కూడా వెలువడింది.
పది వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తెరాస విజయం సాధించింది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాలలోనే కాదు.. రాజకీయ పార్టీలలో సైతం చర్చనీయాంశంగా మారిన అంశం ఏమిటంటే.. ఒక్క ఉప ఎన్నికకే ఇంత వ్యయం అయితే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకెంత ఖర్చు పెట్టాలనే. ఈ చర్చ రాజకీయ పరిశీలకులోనే కాదు, తెరాస, బీజేపీ పార్టీలలో టికెట్ ఆశావహుల్లో కూడా జరుగుతోంది. ఎన్నికల్లో పోటీకి దిగిన వారందరికీ అంతంత ఖర్చు పెట్టిన స్థోమత ఉంటుందా? అయినా అంత ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా? ఇంత వ్యయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఏ విధంగానైనా దోహదం చేస్తుందా అన్న ప్రశ్నలు పార్టీ వర్గాలలోనే చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించామంటూ సంబరాలు చేసుకుంటున్నప్పటికీ.. అది నిజమైన విజయమేనా అన్న ప్రశ్నలు పార్టీలోనే వినవస్తున్నాయి. బీజేపీలో కూడా ఇంత ఖర్చు పెట్టి ఓట్లు, పలుకుబడి పెంచుకున్నామని చెప్పుకుంటున్నా..

 

 

నిజంగా మునుగోడులో పార్టీ బలపడిందా అన్న సందేహాలు కమలం శ్రేణుల్లోనే వినవస్తున్నాయి.  ఇక తెరాస విషయానికి వస్తే…    ఆ పార్టీ విజయం సాధించినా కోట్ల రూపాయల వ్యయం చేస్తే కేవలం పది వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ కే పరిమితం కావడం ఆ పార్టీకి పెద్దగా సంతోషాన్నిచ్చే విషయం అయితే ఎంత మాత్రం కాదు. గత ఎనిమిదేళ్లుగా దూరంగా ఉన్న వామపక్షాలను ఈ సారి కలుపుకోవడం వల్లనే ఆ మాత్రమైనా మెజారిటీ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలకు పది వేల ఓట్లు ఉన్నాయి. వామపక్షాల క్యాడర్ పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారన్నది ప్రతీతి. అందుకే కమ్యూనిస్టుల మద్దతు కారణంగానే తెరాస మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిందన్న విశ్లేషణలు వెల్లువెత్తతున్నాయి.ప్రతి ఓటుకూ వేల రూపాయలు వెచ్చించి, మద్యం ప్రవహింప చేసినా సొంత బలం ఇసుమంతైనా పెరగక పోవడం రానున్న అసెంబ్లీ ఎన్నికల విషయంలో ధీమాగా ఉండే అవకాశాన్ని ఈ విజయం టీఆర్ఎస్ కు ఇవ్వలేదనేది పరిశీలకుల మాట. ఇక బీజేపీ విషయానికి వస్తే.. మునుగోడు ఉప ఎన్నిక విజయంతో తెలంగాణలో తమకు తిరుగేలేదని చాటాలనుకున్న ఆ వ్యూహం బెడిసి కొట్టింది. తెలంగాణలో ఆ పార్టీ ఇప్పటి వరకూ చాటుకుంటున్నట్లు బలం పెరగలేదనీ, ఇదంతా కేవలం కమలం నేతల బిల్డప్ మాత్రమేననీ ఈ ఉప ఎన్నిక స్పష్టంగా చాటింది.అన్నిటికీ మించి ఇప్పటి దాకా దుబ్బాక,

 

 

హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ను మట్టి కరిపించానని ఆ పార్టీ చెప్పుకుంటున్న మాటలపై కూడా అనుమానాలకు కలిగేలా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చింది. దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ విజయానికి ఆయా స్థానాలలో గెలిచిన రఘునందనరావు, ఈటలల సొంత ఇమేజేనని మునుగోడు ఫలితంతో తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు మునుగోడులో బీజేపీకి ఓట్లు గణనీయంగా పెరిగాయని చెప్పుకోవాలనుకున్న ఆ పెరిగిన ఓట్లన్నీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సొంత ఇమేజ్ వల్ల వచ్చినవేననీ, కమలానికి పెరిగిన బలమేమీ లేదని వారు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఈ ఉప ఎన్నికలో పెద్దగా డబ్బు ఖర్చు చేయలేదని చెబుతున్నారు. సిట్టింగ్ సీటును దక్కంచుకోవడం అటుంచి.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎలా నెగ్గుకొస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఈ పరాజయం తెరాసకు మేమే ప్రత్యామ్నాయం అంటు చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నిస్సందేహంగా శరాఘాతమే.  ఏ విధంగా చూసినా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం గెలిచిన పార్టీకీ, ఓడిన పార్టీలకూ కూడా అసంతృప్తినే మిగిల్చింది.

 

 

Tags: The cost remains.

Post Midle