రైలు ప్రమాదం..14కి చేరిన మృతుల సంఖ్య
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది.33 మందికి గాయాలయ్యాయి.మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉందని అధికారులు తెలిపారు.ఆదివారం సాయంత్రం విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంటకాపల్లి వద్ద సిగ్నల్ రాకపోవడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.

అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు అదే ట్రాక్‌పై ముందు వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది.దీంతో పలాస ప్యాసింజర్ వెనుకనున్న రెండు బోగీలు, వాటిని ఢీకొన్న రాయఘడ ప్యాసింజర్ రైలు ఇంజన్‌తో పాటూ మరో మూడు బోగీలు పలాస రైలు మీద పడి నుజ్జునుజ్జయ్యాయి.
అదే సమయంలో కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్స్ మీద పడ్డాయి.దీంతో పెను విషాదం అలముకుంది.ఈ ప్రమాదంపై పిఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి రూ.రెండు లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నట్లు ప్రకటించారు.
క్షత్రగాత్రులకు రూ.50,000 చొప్పున సహాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.తక్షణమే పరిస్థితిని సమీక్షించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రధాని ఆదేశించారు.అలాగే మృతుల కుటుంబాలతో పాటు, క్షతగాత్రులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, మరణించిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు,తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Tags: The death toll in the train accident has reached 14
