అగ్రనేతలు ఇక్కణ్నుంచి పోటీ చేయాలనే డిమాండు పెరుగుతోంది

  Date:26/03/2019

 న్యూఢిల్లీ ముచ్చట్లు:
క్షీణిస్తున్న జాతీయ పార్టీల ప్రాబల్యాన్ని పునరుద్ధరించుకోవాలంటే అగ్రనేతలు ఇక్కణ్నుంచి పోటీ చేయాలనే డిమాండు పెరుగుతోంది. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ప్రతి నియోజకవర్గంలోని గెలుపూ లెక్క వేసుకోవాల్సిందే. క్లిష్టమైన పరిస్థితుల్లో అటు ఎన్డీఏ కూటమి, ఇటు యూపీఏ కూటమి ఎదురీదుతున్నాయి. దక్షిణ భారతంలో ఎంతోకొంత బలమున్న కాంగ్రెసు స్వీయతప్పిదాలతో బోల్తా పడింది. బీజేపీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కర్ణాటక మినహాయిస్తే మిగిలిన చోట్ల అంతంతమాత్రంగానే ఉంటూ ఉత్తరాది పార్టీగానే ముద్ర పడి పోయింది . 2019 ఎన్నికల్లో దక్షిణ భారతంలో తన గతవైభవాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం కాంగ్రెసు కు ఉంది. కనీసం పార్లమెంటులో సెంచరీ కొట్టాలంటే దక్షిణాది రాష్ట్రాలు ఆదుకోవాల్సిందే. అలాగే బీజేపీ రెండువందల బెంచిమార్కు దాటి అధికారానికి చేరువ కావాలంటే ఎంతోకొంత దక్షిణాది ఆసరా దొరకాలి. ఆయా సమీకరణలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అగ్రనాయకులను ఆయాపార్టీలు ఇక్కడి రాష్ట్రాల నుంచి రంగంలోకి దిగమని ఆహ్వానిస్తున్నాయి. దీనివల్ల సెంటిమెంటును ప్రేరేపించేందుకు ఆస్కారముంటుందని పిలుపునిస్తున్నాయి.2014లో మోడీ భారతీయజనతాపార్టీ జాతీయనాయకునిగా , ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచినప్పుడు ఉత్తరభారతం జయహారతులు పట్టింది. దక్షిణాదిన సైతం భారీగానే ఓట్లు దక్కాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మూడు సీట్లు వచ్చాయి.
కేరళ, తమిళనాడు పెద్దగా పట్టించుకోలేదు. కర్ణాటక మాత్రం మెజార్టీ సీట్లను కట్టబెట్టింది. 28 సీట్లకుగాను 17 సీట్లను బీజేపీ సాధించగలిగింది. ఈ విడత ఉత్తరభారతంలో బీజేపీ బాగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగని దక్షిణభారతం అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన సీట్లు కూడా రాకపోవచ్చనేది అంచనా. తెలుగుదేశం తో విడిపోవడంతో తెలంగాణ, ఏపీలలో ఒక్క సీటూ గెలిచే సూచనలు లేవు. అన్నాడీఎంకే తో జోడీ కట్టినా తమిళనాడులో ఆశాజనకమైన వాతావరణం లేదు. కేరళలో ఓట్ల సంఖ్య పెరగవచ్చునేమో కానీ సీట్లు వస్తాయని ఆపార్టీకే నమ్మకం లేదు. గతంలో ఆదుకున్న కర్ణాటక ఈసారి అదే స్థాయి మద్దతు ఇవ్వకపోవచ్చు. జేడీఎస్ , కాంగ్రెసు కలిసి పోటీ చేస్తుండటంతో బీజేపీ సీట్ల సంఖ్య కుదించుకుపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. దాంతో మోదీ కర్ణాటక నుంచి పోటీ చేస్తే బలమైన ప్రభావాన్ని చూపవచ్చని బీజేపీ నాయకులు అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే విభేదాలతో సిగపట్లు పడుతున్న కాంగ్రెసు, జేడీఎస్ లకు చెక్ పెట్టాలంటే మోడీ రావాలనేది పార్టీ డిమాండుగా కనిపిస్తోంది. అదే జరిగితే కర్ణాటకను స్వీప్ చేయవచ్చని ఆశిస్తున్నారు.రాజకీయ వ్యూహాలు లేకుండా నిర్ణయాలు తీసుకుని పార్టీని సర్వనాశనం చేసుకుంది కాంగ్రెసు. దక్షిణభారతంలో అతి పెద్ద రాష్ట్రాన్ని విభజించిన సందర్భంలో టీఆర్ఎస్ వంటి బలమైన ప్రాంతీయపక్షాన్ని పార్టీలో విలీనం చేసుకునే చాన్సు వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణలో పార్టీ పరిస్థితి పూర్తిగా క్షీణించింది.
కర్ణాటకలో అధికారాన్ని కాపాడుకున్నప్పటికీ దినదినగండంగా పాలన సాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఎదురవుతున్న సమస్యలు వచ్చే ఎన్నికల్లో లోక్ సభ సీట్లపై ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది. గతంలో దక్షిణాది నుంచి ఇందిర, సోనియా పోటీ చేశారు. 1980లలో ఇందిర మెదక్ నుంచి పోటీ చేశారు. 1999లో సోనియా బళ్లారి నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. దక్షిణభారత రాష్ట్రాలకు తాము ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెసు నాయకులు చెబుతుంటారు. ఉత్తరభారతంలో ఊడ్చి పెట్టుకుపోయిన పరిస్థితుల్లోనూ కాంగ్రెసును ఆదుకుంది దక్షిణాది రాష్ట్రాలే. ఈసారి రాహుల్ కేరళలోని వాయినాడ్, లేదా కర్ణాటకలోని బీదర్ నుంచి పోటీ చేయాలనే డిమాండు పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దు నియోజకవర్గమైన బీదర్ నుంచి పోటీ చేస్తే మూడు రాష్ట్రాల ఓటర్లపైనా ప్రభావం ఉంటుందనే అంచనాలున్నాయి. పైపెచ్చు ఈసారి సొంత నియోజకవర్గమైన అమేథీలో స్మృతి ఇరాని నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. అందువల్ల రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం సమయోచిత నిర్ణయంగా ఉంటుందని కాంగ్రెసు పార్టీ ఉన్నతస్థాయివర్గాలు పేర్కొంటున్నాయి.నిజానికి అగ్రనాయకులు ఒక్క చోటే పోటీ చేసినప్పటికీ మరీ వ్యతిరేకత ఉంటే తప్ప ఓటమి ఉండదు. రెండేసి నియోజకవర్గాల్లోపోటీ పడటమనేది పార్టీ బలాన్ని పెంచడానికే. 2014లో నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని వడోదర తోపాటు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోనూ పోటీ చేశారు. రెండు చోట్లా ఘన విజయం సాధించారు.
గుజరాత్ లో క్లీన్ స్వీప్ చేయడంతోపాటు యూపీలో మిత్రపక్షంతో కలిపి 73 సీట్లు వచ్చాయి. నాయకుడు పోటీ చేసే స్థానంపై క్యాడర్ శ్రద్ధ పెడుతుంది. నైతిక స్థైర్యం పెరుగుతుంది. రాష్ట్రంలోని మిగిలిన స్థానాలపైనా కచ్చితంగా ఎంతోకొంత ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఉత్తర భారత పార్టీగా ముద్ర పడిన బీజేపీ పై ఆ మచ్చ చెరిపేయాలంటే దక్షిణాది నుంచి ఒక స్థానాన్ని ఎంచుకోవాలన్నది స్థానిక నేతల సూచన. దీనివల్ల కర్ణాటకలో ఫలితాలను కన్సాలిడేట్ చేసుకోవచ్చనే అంచనా ఉంది. దాంతోపాటు కాంగ్రెసు, జేడీఎస్ ల విభేదాలతో రాష్ట్రప్రభుత్వం పడిపోతే బీజేపీ సర్కారును నెలకొల్పేందుకు మోడీ అక్కడ ప్రాతినిధ్యం వహించడం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. మొత్తమ్మీద అగ్రనాయకులు ప్రతినిధులుగా కొనసాగకపోయినా ఫర్వాలేదు. పోటీ చేస్తే చాలు. ఎన్నికల్లో బలమైన ముద్ర వేయగలుగుతారు. అందుకే ప్రాంతీయ నాయకులు అధిష్ఠానాలపై ఒత్తిడి చేస్తున్నారు.
Tags:The demand for the top contestants is growing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *