కాగితాలకే పరిమితమైన మండలాల అభివృద్ధి
అదిలాబాద్ ముచ్చట్లు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త మండలాల మంజూరులో మరోసారి మొండిచేయి చూపారు.. తాజాగా ప్రకటించిన కొత్త మండలాల జాబితాలో జిల్లాకు చెందినవి ఒక్కటి లేకపోవటంతో మళ్లీ నిరాశే మిగిలింది.. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటును ఆరేళ్ల క్రితం చేయగా.. మిగతావి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.. స్వయంగా సీఎం కేసీఆర్ మాట ఇచ్చి నాలుగేళ్లవుతున్నా.. ఇప్పటి వరకు హామీ నెరవేరలేదు.. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 10 మండలాలు కావాలనే డిమాండ్ ఉండగా.. తాజాగా ప్రకటించిన 13 మండలాల జాబితాలో జిల్లాకు సంబంధించి ఒక్క మండలం కూడా లేకపోవటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది..నిర్మల్ జిల్లా తానూర్, కుబీర్ మండలాల్లోని గ్రామాలను కలిపి బెల్తరోడాను కొత్త మండలం చేయాలనే డిమాండ్ ఉంది. రెండు మండలాలు విస్తీర్ణంలో, జీపీల పరంగా పెద్ద మండలాలు కాగా.. మెజారిటీ జీపీలు మహారాష్ట్ర సరిహద్దులోనే ఉన్నాయి. తానూరు మండలంలో గతంలో 20 జీపీలుండగా.. కొత్తగా 11 ఏర్పాటు చేయటంతో 31కి చేరాయి. కుభీరు గతంలో 20గ్రామ జీపీలుండగా.. కొత్తగా 21 ఏర్పాటు చేయటంతో 41కి చేరాయి. దీంతో రెండు మండలాల గ్రామాలకు మధ్యలో ఉన్న బెల్తరోడా కేంద్రంగా కొత్త మండలం తప్పనిసరి.నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరెల్లి, మామడ మండలం పొన్కల్ కొత్త మండలాల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మామడలో గతంలో 13జీపీలుండగా.. కొత్తగా 14 చేయటంతో 27కు చేరాయి. పొన్కల్, పోతారం, అనంత పేట్, కమల్ కోట్, కమల్ కోట్ తండా,
ఆదర్శనగర్, టెంబుర్ని, నల్దుర్తి, బండల ఖానాపూర్, వెంకటాపూర్ తండాను కలుపుకుని పొన్కల్ మండలంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సారంగాపూర్ మండలంలో గతంలో 18 జీపీలుండగా.. కొత్తగా 18 చేయటంతో 36కి చేరాయి. బీరవెల్లి, ప్యారమూర్, వంజర్, తాండ్ర(జి), చించోలి(ఎం), కంకెట, వైకుంఠాపూర్(దోనిగాం), జౌళితో పాటు దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామాన్ని కలిపి బీరవెల్లి కొత్త మండలం ప్రతిపాదనలకు కదలిక లేకుండా పోయింది.ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాల, జైనథ్ మండలం సాత్నాల/రామాయి కొత్త మండలాల డిమాండ్ ఏళ్లుగా ఉంది. బోథ్లో గతంలో 18జీపీలకు కొత్తగా 15 పెరగటంతో 33కి చేరాయి. బోథ్ కు వజ్జర్ లాంటి గ్రామాల నుంచి రావాలంటే 35కి.మి. దూరం. ఆటోలు, ఎడ్లబండిపై రావాలి. 15జీపీలతో సొనాల కొత్త మండలం కోసం ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ చేసి.. వినతి పత్రాలు అందజేశారు. జైనథ్లో 42 జీపీలుండగా.. వైశాల్యపరంగా పెద్దది. నవంబర్ 26, 2018న ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ సొనాల, బోథ్ మండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపాదనలు పంపి నాలుగేళ్లయినా.. ఇప్పటికీ నెరవేరలేదు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను 2016 అక్టోబర్ 11న పునర్విభజన చేసి.. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ నాలుగు జిల్లాలు ఏర్పాటు చేశారు. గతంలో ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల 5 రెవెన్యూ డివిజన్లుండగా.. భైంసా, కాగజ్ నగర్, బెల్లంపల్లి 3 డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయటంతో 8కి చేరాయి. గతంలో 52 మండలాలుండగా.. కొత్తగా 18 మండలాలు ఏర్పాటు చేయటంతో 70కి చేరాయి. నిర్మల్ జిల్లా(6)లో బాసర, నర్సాపూర్(జి), సోన్, నిర్మల్ అర్బన్, పెంబి, దస్తురాబాద్, ఆసిఫాబాద్ జిల్లా(3)లో చింతలమానేపల్లి,

పెంచికల్పేట్, లింగాపూర్, ఆదిలాబాద్ జిల్లా(5)లో మావల, సిరికొండ, భీంపూర్, ఆదిలాబాద్ అర్బన్, గాదిగూడ, మంచిర్యాల జిల్లా(4)లో హాజీపూర్, నస్పూర్, కన్నెపల్లి, భీమారం కొత్త మండలాలు ఏర్పాటు చేశారు.జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు తర్వాత మరికొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో టీఆర్ఎస్ మళ్లీ ప్రచారాస్త్రంగా వినియోగించుకుంది. ప్రస్తుతం ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లుండగా.. ఖానాపూర్, బోథ్, చెన్నూర్ కొత్త రెవెన్యూ డివిజన్ల డిమాండ్లు ఉంది. నిర్మల్ జిల్లాలో తానూర్ మండలం బెల్తరోడా, సారంగపూర్ మండలం బీరవెల్లి, మామడ మండలం పొన్కల్, లక్ష్మణచాంద మండలం వడ్యాల్, మామడ మండలం వెంకటాపూర్, కడెం మండలం లింగాపూర్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల, జైనథ్ మండలం సాత్నాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పార్పెల్లి, హాస్నాద కొత్త మండలాలు ఏర్పాటు డిమాండ్ ఉంది.కోటపల్లి వైశాల్య పరంగా చాలా పెద్దగా ఉండటంతో.. మూడు మండలాలుగా విభజించాలనే డిమాండ్ ఉంది. గత నాలుగేళ్లుగా ఇవి ప్రతిపాదనలకే పరిమితం కాగా.. తాజాగా ప్రకటించిన 13 మండలాల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క కొత్త మండలం లేకపోవటం జిల్లా వాసులను పూర్తి నిరాశ కలిగించింది. స్థానిక ఎమ్మెల్యేలు పట్టు పట్టకపోవటం వల్లనే ఈ పరిస్థితి ఉందని.. ప్రతిపాదనలకు మోక్షం లభించటం లేదనే వాదన ఉంది. మరోసారి ఉద్యమ బాట పట్టేందుకు ఆయా మండలాల వాసులు సిద్ధమవుతున్నారు.
Tags: The development of mandals is limited to paper only
