The dried batalai

ఎండుతున్న బత్తాయి

Date:09/05/2020

నల్గొండ ముచ్చట్లు:

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పండ్లతోటలకు నీళ్లు అందక ఎండిపోవడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. బత్తాయి సాగులో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన నల్లగొండ జిల్లా నేడు బోర్లు ఎండిపోవడంతో తోటలను తొలగిస్తున్నారు. జిల్లాలో బత్తాయి తోటలు సుమారు 30 వేల హెక్టార్లకు పైబడి ఉన్నాయ. నిమ్మతోటలు 12 వేలకు పైబడి ఉండగా మామిడి 15 వేల హెక్టార్లకు పైగానే ఉన్నాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా రైతన్నలు కరువు కాటకాలతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదు సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటేనే ఆ తోట పంట చేతికి వస్తుంది. భూగర్భజలాలు 2.72 మీటర్లలోతుకు పడిపోవడంతో బోర్లు పోయకపోవడంతో వేసిన పండ్ల తోటలు అర్ధాంతరంగా ఎండిపోయాయి.అనేక మంది రైతన్నలు పండ్ల తోటలకు నీళ్లు తక్కువ అధిక లాభాలు పొందవచ్చని భావించిన వారికి నిరాశనే మిగిల్చింది.

 

 

 

 

పంటలు చేతికి వచ్చే సమయానికి మార్కెట్ ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో దేశంలో ఎక్కడలేని విధంగా పండ్లతోటలు వున్నా మార్కెట్ సౌకర్యం లేదు. దళారుల చేతిలో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి రైతన్న రవాణా ఖర్చులనైనా పొందలేకపోతున్నారు. కత్తెర పంట టన్ను బత్తాయికి 25,000 నుండి 30,000 వరకు ధర పలికింది. అదే బత్తాయి ఈ ఖరీఫ్‌లో కేవలం 7 వేల రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కరోనాతో ఎక్కడి పంటలు అక్కడే నిలిచిపోయాయి.కత్తెర పంటను ఢిల్లీ, కలకత్తాకు ఎగుమతి చేయడంతో అనుకున్న ధరలు వచ్చాయని ప్రస్తుతం టన్ను 7వేలకే విక్రయిస్తున్నారు.

 

 

 

 

అదేవిధంగా నిమ్మతోటల రైతులు కూడా ఇప్పుడు తీవ్రంగా నష్టాల్లోనే ఉన్నారు. కత్తెర పంటకు 30 కిలోల సిమెంట్ బస్తాకు రూ.3000లు ఉండగా ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బస్తాకు రూ.200ల నుండి 500 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ సంవత్సరం మామిడి దిగుబడి పెద్దగా రాలేదని రైతులు పేర్కొంటున్నారు. మామిడి పూత దశలో అకాల వర్షాలు, ఈదురు గాలులు వీచడంతో పూతరాలి మామిడి దిగుబడి పెద్దగా రాలేదు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో తోటలు ఎండి పోయాయి. బత్తాయి చెట్లను తొలగిస్తు నిమ్మ, కూరగాయల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

 

 

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం పండ్లతోటల రైతులకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలని రైతులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కోరుతున్నారు. గత పాలకులు జిల్లాలోని ఎస్‌ఎల్‌బిసి ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని రైతులకు ఇచ్చిన హామీ నీటిమీది రాతలాగానే మిగిలిపోయిందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వమైనా నల్లగొండ జిల్లా బత్తాయి, నిమ్మతోటల రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించి అదుకుంటారో లేదో వేచిచూడాల్సిందే. ఎండి పోయిన తోటల రైతులకు చెట్టుకు 2 వేల రూపాయల ఇన్సురెన్సు సౌకర్యం కల్పించాలని రైతన్నలు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

పరీక్షల షెడ్యూల్స్ 

Tags: The dried batalai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *