బాధ్యతలు స్వీకరించిన ధర్మాన,బాలినేని,అవంతి

Date:13/06/2019

అమరావతి ముచ్చట్లు:

ముగ్గురు ఏపీ మంత్రులు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రోడ్లు భవనాల శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ సచివాలయం ఐదో బ్లాక్ లోని తన ఛాంబర్లో అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్డీబీ ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.6,400 కోట్లతో రెండేళ్లలో అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్  వే నిర్మాణం పూర్తి చేస్తామని, దుర్గగుడి పైవంతెన నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘‘ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ జగన్ పాలన చేస్తున్నారు. సీఎం సూచనల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటా’’ అని ధర్మాన తెలిపారు.పీపీఏలను సమీక్షిస్తాం: బాలినేని
సచివాలయం రెండో బ్లాక్లోని తన ఛాంబర్ లో విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన రెండు కమిటీల నియామకం దస్త్రంపై తొలిసంతకం చేశారు. ఈసందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. గతంలో వైఎస్, ఇప్పుడు ఆయన తనయుడి వద్ద మంత్రిగా పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. పగటిపూట రైతులకు విద్యుత్ సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

 

 

 

ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ రాయితీని పొడిగిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని, ఐదు వేల టన్నుల ఎర్రచందనం వేలం వేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ‘‘పీపీఏలను సమీక్షిస్తాం. కేంద్రం సమీక్షించవద్దన్న విషయాన్ని ప్రధాని దృష్టికి జగన్ తీసుకెళ్లారు. తప్పులుంటే సమీక్షిస్తామని ప్రధాని సీఎం జగన్ వివరించారు’’ అని బాలినేని తెలిపారు. సచివాలయం మూడో బ్లాక్ లోని  తన ఛాంబర్ లో   పర్యాటకశాఖామంత్రి అవంతి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. పర్యాటక కార్పొరేషన్ తరహాలో  ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘‘ అతిథిదేవోభవ నినాదంతో ముందుకెళ్తాం. 13 జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తాం. ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులిస్తాం. ఏపీ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్ను నియమిస్తాం. ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పర్యాటకులకు అన్ని విధాలుగా భద్రతకల్పిస్తాం. రేవ్ పార్టీలు, డ్రగ్స్  ఉక్కుపాదం మోపుతాం’’ అని తెలిపారు.

 

ఒక్క ఐడియాతో ప్రభుత్వ స్కూళ్లు దశ మారుతోంది

 

Tags: The duties, the respective, and the avanti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *