ఆ కరకట్ట వల్లే భద్రాచలం పట్టణమంతా సురక్షితంగా ఉంది చంద్రబాబు…

భద్రాచలం ముచ్చట్లు

ఏపీ, తెలంగాణ సరిహద్దులోని విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.
పర్యటనలో భాగంగా భద్రాచలంలో గురువారం రాత్రి బస చేసిన ఆయన.. శుక్రవారం ఉదయం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధానాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్నాన ఘట్టాలు, కరకట్ట వద్దకు వెళ్లి ఇటీవల వచ్చిన వరద పరిస్థితిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
భద్రాచలంలో వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడేందుకు తెదేపా హయాంలో 20 ఏళ్ల క్రితం కరకట్ట నిర్మించామని.. దాని వల్లే ఇప్పుడు పట్టణమంతా సురక్షితంగా ఉందన్నారు. ప్రజలంతా గుర్తుపెట్టుకునే విధంగా అప్పట్లో దాన్ని నిర్మించామన్నారు. ఇటీవల భారీగా వరద వచ్చినా కరకట్ట ఉండటంతోనే భద్రాచలం ప్రజలంతా ధైర్యంగా నిద్రపోగలిగారని చెప్పారు. వరద కరకట్ట పైవరకూ వచ్చిందని.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు ముంపు గ్రామాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవే శాశ్వతంగా ఉంటాయని చంద్రబాబు చెప్పారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మీదుగా వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఆయన వెళ్లారు.

Tags:The entire town of Bhadrachalam is safe because of that stricture Chandrababu…

Leave A Reply

Your email address will not be published.