తెలంగాణ మంత్రివర్గం కూర్పు తుది దశకు

పండగ తర్వాత సెమి కేబినెట్
Date:14/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ కొత్త మంత్రివర్గం కూర్పు తుది దశకు చేరకుంది. ఇప్పటికే పలువురు సీనియర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం కూర్పుపై చర్చించారు. తన మదిలోని మాటను సీనియర్ల చెవిలో వేశారు. అంతా సరేనని వెనుదిరిగారు. దీంతో కూర్పు కసరత్తు దాదాపు పూర్తయినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొంత మంది సీనియర్ల విషయంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరి స్తున్నారని తెలిసింది. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావుతో పాటు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలతో కేసీఆర్ చర్చలు జరిపిన అనంతరమే కొత్త మంత్రివర్గానికి తుది రూపం ఇస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లో తిరిగే వారికే మంత్రివర్గంలో స్ధానం ఉంటుందని తెలుస్తోంది. కులాల కూర్పు, జిల్లాల ప్రాతినిథ్యం ద్రుష్టిలో ఉంచుకొని కొంత మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడానికి  రంగం సిద్దమైంది. స్పీకర్ స్ధానం విషయంలో ఇప్పటికే నలుగురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. ఈ నలుగురు  ఆ స్ధానాన్ని అలంకరించడానికి  ఇష్టపడటం లేదు. మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌లో ఎవరో ఒకరిని స్పీకర్ స్ధానంలో కూర్చోబెట్టడం ఖాయమని అంటున్నారు.
  సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 18న కేసీఆర్ తన క్యాబినెట్ విస్తరించే అవకాశం ఉంది. ఈ విస్తరణ పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది.  ఆరేడు మందికి మించి స్ధానం లభించే అవకాశం లేదంటున్నారు. కులాల కూర్పు, జిల్లాల మధ్య సమతుల్యత పాటించాల్సి ఉన్నందున పాత పది జిల్లాలను ప్రామాణికంగా తీసుకొంటున్నారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత  ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహ్మద్ మహమూద్‌అలీ ప్రమాణ స్వీకారం  చేశారు. ఇటీవల ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు  పూర్తి స్థాయి మంత్రివర్గానికి తొందరేముందని కేసీఆర్ వ్యాఖ్యనించడం గమనార్హం. ఈ నెల 17 నుండి శాసనసభ సమావేశాలు జరగబోతున్నందున పరిమిత సంఖ్యలోనే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభం కావడంతో  ఆశావహుల్లో  రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. సీనియర్ నాయకులను పూర్తిగా పక్కన బెట్టి, యువతతో క్యాబినెట్ ను ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయనే విషయం బయటికి పొక్కడంతో కేటీఆర్ చుట్టు ప్రదక్షణలు చేసే యువ ఎమ్మెల్యేల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది.
బీసీలలో యాదవ, గౌడ్, మున్నూరు కాపు, ముదిరాజ్ కులాల నాయకులకు పెద్ద పీట వేయనున్నారని తెలిసి కొంత మంది తెరాస కార్యాలయం చుట్టే తిరుగుతున్నారు. వెలమ కులం నుంచి కే. తారక రామారావు, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మైనంపల్లి హన్మంతరావులలో ఏ ఇద్దరికైనా మంత్రి పదవులు వరించవచ్చంటున్నారు . పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నందున పార్టీకే పరిమితం చేస్తారా క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తారా అనేదానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. హరీశ్ రావును కూడా మంత్రిగా కొనసాగించాలని అనుకున్నప్పటికీ మూడో కూటమి రాజకీయాల కోసం ఢిల్లీలో ఆయన సేవలను వినియోగించుకోవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. వ్యవసాయం, మార్కెటింగ్, మత్స్య శాఖ లను కలిసి హరీశ్ రావు కు అప్పగించవచ్చని మరో వాదన విన్పిస్తున్నది. హైదరాబాద్ నగరం నుంచి యాదవ కులం కోటా నుంచి తలసాని శ్రీనివాస్, మున్నూరు కాపు కులం కోటా నుంచి దానం నాగేందర్ కు అవకాశాలు ఉన్నాయి. తలసానికే మంత్రి పదవి వరిస్తుందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.పార్టీలో చేరే సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం తనకు ఖాయంగా మంత్రి పదవి లభిస్తుందని దానం నాగేందర్ ధీమాతో ఉన్నారు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి కి మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కనున్నది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైనందున ఆయనకు  కీలకమైన శాఖలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే, ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ కు మంత్రివర్గంలో చోటు లభించడం ఖాయమంటున్నారు. ముదిరాజ్ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేందర్ కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్నది. గౌడ్ కులం నుంచి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్ గౌడ్ కు అవకాశం ఉంది. మహబూబ్ నగర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఉద్యోగ సంఘం నాయకుడు కావడం ఆయనకు అనుకూలమైన పరిణామాలని అంటున్నారు.  ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లకు పదవులు వరించే అవకాశం ఉంది. ఒకవేళ రెడ్యా నాయక్ వద్దనుకుంటే ఆయన స్థానంలో ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయక్ ను ఎంపిక చేయవచ్చంటున్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కనట్లయితే డిప్యూటీ స్పీకర్ గా నియమించవచ్చని టీఆర్‌ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మహిళల కోటా నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. సీఎం కేసీఆర్, హరీశ్ రావులు ఇద్దరూ ఒకే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రొటోకాల్ సమస్య వచ్చే అవకాశం ఉండడంతో పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రివర్గంలో స్ధానం లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి  ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఇటీవలే చేరిన జలగం ప్రసాద్ రావు లను మంత్రివర్గంలోకి  తీసుకోవచ్చనే  ప్రచారం జరుగుతోంది. ప్రసాద్ రావును ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
కమ్మ కులం నుంచి  ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్లు వ్యాప్తిలోకి వచ్చాయి. కులాల కూర్పు ఈ విస్తరణలో ఉంటుందా, పూర్తి స్థాయిలో క్యాబినెట్ లో సరి చేస్తారా అనేది అంచనా వేయలేకపోతున్నారు. ఆరేడు మందినే తీసుకుంటున్నందున కులాల మధ్య సమతుల్యత సాధించడం అంతగా సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులను ఎమ్మెల్సీలుగా ఎన్నుకొనడంతో పాటు మంత్రివర్గంలో స్దానం కల్సించే అంశంపై కూడా చర్చ జరిగిందంటున్నారు.    రానున్నది పార్లమెంటు ఎన్నికలు కనుక కేసీఆర్ జాగ్రత్తగా అన్ని కోణాల్లో ఆలోచించి క్యాబినెట్ కూర్పు చేస్తారని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పార్లమంట్ ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని మంత్రివర్గం కూర్పుపై కసరత్తు జరుగుతున్నందున మంత్రుల ఎంపిక ఎవరికీ అంతుపట్టకుండా ఉందని సీనియర్లు పేర్కొనడం గమనార్హం
Tags:The final stage of the composition of the Telangana Cabinet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *