అవినీతి ప్రక్షాళనకు తొలి అడుగు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

రహదారి ఆక్రమణలపై మొదటి దెబ్బ రాజీవ్ నగర్ లో ఉద్రిక్తత అవినీతి ప్రక్షాళనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి నడుం కట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవినీతిపై కొరడా జులుపించేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా రాజీవ్ నగర్ లో రహదారి ఆక్రమణలపై మొదటి దెబ్బ వేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శనివారం రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా రాజీవ్ నగర్ రహదారి ఆక్రమాలపై దృష్టి సారించింది. ఆర్డీవో రవిశంకర్ రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం జేసీబీల సాయంతో రాజీవ్ నగర్ లోని శ్రీకాళహస్తి-పిచ్చాటూరు రహదారి వెంబడి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు పూనుకున్నారు. మూడు పునాదులను ధ్వంసం చేసిన అనంతరం అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ స్థలాలపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయనీ, రెవెన్యూ అధికారులు పట్టాలు, అనుభవ పత్రాలను ఇచ్చారని ఆ వ్యక్తులు అక్రమణలను తొలగించడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. తమకు అన్ని హక్కులు ఉన్నాయి కనకే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు మీటర్లు, విద్యుత్ సర్వీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ స్థలాలను తాము లక్షలు పోసి కొన్నామనీ, లక్షలు పెట్టి నిర్మాణాలు చేశామంటూ వాపోయారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో రాజీవ్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజీవ్ నగర్ రహదారి వెంబడి దుకాణ నిర్మాణాలు చేపట్టిన ఓ వ్యక్తి అయితే గదిలోపల తాళం పెట్టుకుని తన దుకాణాన్ని ధ్వంసం చేయకుండా అడ్డుకోవడం గమనార్హం. దీంతో రెవెన్యూ యంత్రాంగం చేసేదేమీ లేక మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటో ఆర్డీవో కార్యాలయానికి తీసుకొచ్చి చూపాలని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడం కొసమెరుపు.* దొంగే దొంగన్న రీతిగా ‘రెవెన్యూ’ దొంగలు పడ్డ ఆర్నెళ్లకు అవేవో మొరిగినట్టు..దొంగే దొంగ అన్న రీతిగా రాజీవ్ నగర్ రహదారి ఆక్రమణల పై రెవెన్యూ అధికారుల తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గడిచిన రెండేళ్లుగా రాజీవ్ నగర్ లో ఎన్నో అక్రమ నిర్మాణాలు యధేచ్చగా కొనసాగాయి. ఆక్రమణలు జరిగిపోయాయి. ఎన్నో వివాదాలు, గొడవలు, దాడులు, ప్రతిదాడులు జరిగాయి. అయితే ఇవేవీ తమకు తెలియదనీ, తమ వరకు రాలేదనీ, మాకు సమాచారం లేదనీ, తమకు సంబంధం లేదని రెవెన్యూ అధికారులు తామరాకుపై నీటి బొట్టులా వ్యవహరించారు. ప్రభుత్వం మారడంతోనే అక్రమ నిర్మాణాలంటూ కేకలు పెడుతున్నారు. రోడ్డు పొరంబోకు, కాల్వ పొరంబోకు అంటూ పొలికేకలు పెడుతున్నారు. గత మూడేళ్లుగా ఎంతోమంది ఫిర్యాదులు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదు. శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన రాజీవ్ నగర్ కథ ఇది. గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని స్థానిక నాయకులు, కార్యకర్తలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ అధికారుల అండతో జరిగాయనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ స్థలాలను అనధికారికంగా అమ్మకాలు చేశారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పనిలో పనిగా పేదవారి స్థలాలపై కూడా కన్నేశారు. బాధితులు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. వైసిపి ప్రభుత్వం పోయి టిడిపి ప్రభుత్వం రావడంతో అధికారులకు చట్టాలు, నిబంధనలు వెంటనే గుర్తుకు వచ్చేసాయి. ఆర్డీవో స్థాయి అధికారి కూడా ఇక్కడే ఉన్నారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు తహశీల్దార్లు, డీటీలు, ఆర్ ఐలు, వీఎర్వోలు అందరూ ఉన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పేదల బాధలను వినే ఓపిక, తీరిక కూడా వారికి లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో విచ్చల విడిగా పట్టాల అమ్మకాలు జరిగాయి. స్థలాలను ఆక్రమించారు. ఎన్నికల సమయంలో పట్టాలిచ్చిన అధికారులెవరు.పట్టాలపై ఏ అధికారి సంతకాలున్నాయి. నిజమైనవా నకిలీవా అన్న సంగతి ఇప్పుడైనా తెలుస్తారా లేదా..? చూడాలి మరి.

 

 

Tags:The first step to clean up corruption

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *