Natyam ad

తొలి తెలుగు స్వతంత్ర నాటకకర్త ధర్మవరం రామకృష్ణమాచార్యులు-డా మూల మల్లికార్జున రెడ్డి

కడప ముచ్చట్లు:

 

తెలుగు సాహిత్య చరిత్రలో స్వతంత్ర నాటక రచనకు నాంది పలికి తొలి స్వతంత్ర నాటకకర్తగా, తెలుగు నాటక రంగ చరిత్రలో ‘ఆంధ్రనాటక పితామహుడు’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి ధర్మవరం రామకృష్ణమాచార్యులని సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా. మూల మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో బుధవారం ఉదయం ప్రసిద్ధ నాటకకర్త, దర్శకుడు, నటుడు ధర్మవరం రామకృష్ణమా చార్యులు 111వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా.మూల మల్లికార్జునరెడ్డి, సిబ్బంది, పాఠకులు కలసి ముందుగా ధర్మవరం రామకృష్ణమాచార్యులు చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా. మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1853లో అనంతపురంజిల్లా ధర్మవరంలో జన్మించి, బళ్ళారిలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారని అన్నారు. నాటక కర్తగా, దర్శకునిగా, నటునిగా నాటక రంగానికి ఎనలేని సేవచేసిన రామకృష్ణమాచార్యులు తన 20వ ఏటనే స్వతంత్ర రచనకు పూనుకొని 1886లో ‘చిత్రనళీయం’ అనే స్వతంత్ర నాటకాన్ని రాశారని పేర్కొన్నారు.

 

 

ఆ రోజుల్లోనే నాటక ప్రదర్శనలకోసం ‘సరసవినోదిని సభ’ను ఏర్పాటు చేసి ఎన్నో నాటకాలను ప్రదర్శింపజేశారని అన్నారు. రామకృష్ణమాచార్యులు మొత్తం 29 నాటకాలను రచించారని, అందులో 14 నాటకాలు ముద్రింపబడి మిగిలిన 15 నాటకాలు అముద్రితాలుగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. 1910లో హైదరాబాదు నగరంలో ‘సరసవినోదిని సభ’వారు ధర్మవరంవారి నాటకాలను ప్రదర్శిస్తుండగా ఆ కార్యక్రమానికి వచ్చిన గద్వాల్‌ మహారాజు ఆ నాటకాలను చూసి ఆనందించి ఒక బృహత్కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ‘ఆంధ్ర నాటక పితామహ’ బిరుదుతో  రామకృష్ణమాచార్యులను గౌరవించారని అన్నారు. 1886లో ముద్రింపబడిన చిత్రనళీయం,  1886లో ప్రదర్శింపబడిన స్వప్నానిరుద్ధము, 1896లో ముద్రింపబడిన బృహన్నల, 1896లో వచ్చిన వరూధిని, 1905లో ముద్రింపబడిన యుధిష్ఠిర యౌవరాజ్య పట్టాభిషేకం, 23.05.1910న ప్రారంభించి 25.5.1910న కేవలం మూడు రోజుల్లో పూర్తిచేసిన హరిశ్చంద్ర, 1911లో ముద్రింపబడిన రాజ్యాభిషేకం, 1914లో ముద్రింపబడిన సావిత్రీ చిత్రాశ్వం, 1916లో ముద్రింపబడిన అభిజ్ఞానమణిమంతం,  అనంతరం ముద్రింపబడిన ఉపేంద్రవిజయం, పాదుకాపట్టాభిషేకం, ప్రమీలార్జునీయం, పాంచాలీ స్వయంవరం, అజామిళ, చిరకారి, ప్రహ్లాద, మోహినీరుక్మాంగద, సుగ్రీవ పట్టాభిషేకం, విషాదసారంగధర, రోషనారా శివాజి, ముక్తావళి వంటి నాటకాలు  ప్రదర్శింపబడి ప్రేక్షకాదరణ పొందాయని అన్నారు.

 

 

Post Midle

సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ తెలుగులో విషాదాంత నాటకాలకు ధర్మవరం రామకృష్ణమాచార్యులే ఆద్యులని, ఆయన తన ‘విషాద సారంగధర’తో దానికి నాంది పలికారని అన్నారు. ఆయన ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధారకులు, మహాకవి వావిలికొలను సుబ్బారావు రచించిన రామాయణ కావ్యావిష్కరణ సభకు అధ్యక్షత వహించి, ఆయనను ‘ఆంధ్రవాల్మీకి’ బిరుదుతో సత్కరించారని అన్నారు. గ్రంథపాలకులు ఎన్‌.రమేశ్‌రావు మాట్లాడుతూ ధర్మవరం రామకృష్ణమాచార్యులు వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ అవధానాలు కూడా చేశారని, నిరంతర అధ్యయనశీలి అని, జ్యోతిషశాస్త్రంలోనూ దిట్ట అని అన్నారు. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో మొట్టమొదట నాటక అంకాల్లో రంగాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే అని అన్నారు. కొత్తపల్లి రామాంజనేయులు మాట్లాడుతూ రామకృష్ణమాచార్యులు స్వాతంత్య్రోద్యమ భావాలను తన నాటకాల్లో చొప్పించి ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు.ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం జూనియర్‌ అసిస్టెంట్‌ ఆర్‌.వెంకట రమణ, పాఠకులు రాజేష్‌బాబు, రాజశేఖర్‌, రెడ్డయ్య, సుబ్బారెడ్డి, సురేంద్ర, నరేష్‌, మధుసూదన రెడ్డి, ప్రసాద్‌, రంగా, శివ, సాయిరామ్‌, అమృత్‌రాజ్‌, అనిల్‌ కుమార్‌   తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The first Telugu independent dramatist was Dharmavaram Ramakrishnamacharya-Dr Mool Mallikarjuna Reddy

Post Midle