నిధులున్నా నిర్లక్ష్యమే..!

Date:06/12/2018
చిలకలూరిపేట ముచ్చట్లు:
చిలకలూరిపేట ప్రాంత వాగుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించినా భూ సేకరణ జాప్యంతో నేటికీ పనులు జరగకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం 2009లో రూ.30 కోట్లు విడుదల చేయగా ఇందులో 58 శాతం వంతెనల ఏర్పాటుకు కేటాయించారు. మిగిలిన 42 శాతంతో వాగులు అభివృద్ధి చేయాల్సివుంది. వంతెనల నిర్మాణం పూర్తి చేసిన అధికారులు వాగుల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో ఏళ్లుగా పనులు జరగక ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. ప్రధాన ఓగేరు, కుప్పగంజి, నక్కవాగు, కొండవాగు, ఉప్పువాగులు మొత్తం 67 కి.మీ పరిధిలో వెడల్పు చేయాలంటే లోపల ఉన్న పూడికను తీసి పక్కనే కట్టలుగా వేయాలి. ఇందుకు 1450 ఎకరాలు అవసరమని అప్పట్లోనే గుర్తించగా ఇందులో 600 ఎకరాలు పట్టా భూములు, 850 ఎకరాలు పోరంబోకు ఉంది. దీనికి సంబంధించి మురుగునీటి పారుదల శాఖ గతంలో రెవెన్యూ శాఖకు పంపగా సర్వే కూడా పూర్తి చేశారు. కరకట్టల ఏర్పాటుకు రైతుల భూములు అవసరం ఉండటంతో భూసేకరణ కోసం ప్రతిపాదనలు పంపి సంవత్సరాలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. ఈ కారణంగా వంతెనలు నిర్మాణం పూర్తయినా వాగుల అభివృద్ధి అలాగే ఉండిపోయింది. గత ఏడాది యడవల్లి వద్ద నుంచి చిలకలూరిపేట వరకు ఓగేరు, చిరుమామిళ్ల నుంచి తుర్లపాడు వరకు నక్కవాగు అభివృద్ధి కోసం రూ.10 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతోపాటు 34వ ప్యాకేజి కింద గొట్టిపాడు నుంచి మానుకొండవారిపాలెం, వేలూరు, గణపవరం వరకు, గణపవరం నుంచి లింగంగుంట్ల, కావూరు, గోవిందపురం మీదుగా మైనంపాడు వరకు ఉన్న కుప్పగంజి వాగును అభివృద్ధి చేసేందుకు కూడా నిధులు మంజూరయ్యాయి. అయినా గుత్తేదారులు పనులు చేపట్టక పోవడంతో భారీ వర్షాలు, వరదలు వస్తే సమస్య తీవ్రత యథాతథంగానే ఉంటుంది.
Tags:The funds are negligible ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *