14 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ 

Date:27/04/2019
 న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 ఉత్పత్తులకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యున్నత నాణ్యత, వైశిష్ట్యం కలిగిన ఉత్పత్తులకు అందజేసే ఈ జీఐ ట్యాగ్‌ను అందుకున్న ఉత్పత్తుల్లో హిమాచల్‌కు చెందన కాలాజీరా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జీరాపూల్, ఒడిశాకు చెందిన కందమాల్ హల్దీ తదితర ఉత్పత్తులున్నాయి. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ అందించిన వివరాల మేరకు ఈ ట్యాగ్‌ను అందుకున్న ఇతర ఉత్పత్తుల్లో కర్నాటకకు చెందిన కూర్గ్ అరబికా కాఫీ, కేరళ వైనాడ్‌కు చెందిన రోబస్టా కాఫీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు వ్యాలీ అరబికా కాఫీ, కర్నాటకకు చెందిన సిరిసి సుపారీ, హిమాచలీ చులీ ఆయిల్ వంటివి ఉన్నాయి. ఈ జిఐ ట్యాగ్ వల్ల సంబంధిత ఉత్పత్తిదారులకు మంచి ధరలు సమకూరడమేకాక, మరే ఇతర ఉత్పత్తిదారులూ దీని డూప్లికేట్‌ను తయారుచేసి పేరును దుర్వినియోగం చేసేందుకు వీలుండదు.
ప్రధానంగా ప్రాంతీయ వ్యవసాయోత్పత్తులు, ప్రకృతిసిద్ధమైన లేదా తయారుచేసిన (చేతివృత్తులు, లేదా పారిశ్రామిక) ఉత్పత్తులకు ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను వినియోగిస్తారు. ఉత్పత్తి నాణ్యతతోబాటు ఆ ప్రాంత విశిష్టతను ఈ ట్యాగ్ తెలియేజేస్తుంది. డార్జిలింగ్ టీ, తిరుపతి లడ్డూ, కాంగ్రా పెయింటింగ్స్, నాగ్‌పూర్ కమలాలు, కాశ్మీర్ పాస్మినా వంటి మనదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఉత్పత్తులు ఇలా జిఐ ట్యాగ్‌ను పొందినవే. దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ట్యాగ్ వల్ల సంబంధిత ఉత్పత్తి వైశిష్ట్యం మరింతగా పెరుగుతుందని, వినియోగదారులకు సైతం ఉత్పత్తిపై పూర్తి విశ్వాసం కలుగుతుందని ‘నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (నిపో) అధ్యక్షుడు టీసీ జేమ్స్ తెలిపారు. మొత్తం పదేళ్ల కాలానికి ఈ ట్యాగ్ అమలులో ఉంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల మేరకు ఏర్పాటైన ఈ ట్యాగ్ ఇప్పటి వరకు మనదేశానికి చెందిన 344 ఉత్పత్తులకు మంజూరైంది. 2004లో తొలిసారి ఈ ఘనతను డార్జిలింగ్ టీ అందుకుంది.
Tags:The GI tag for 14 products

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *