ఎట్టకేలకు తెరుచుకున్న గోడౌన్

Date;28/02/2020

ఎట్టకేలకు తెరుచుకున్న గోడౌన్

అనంతపురంముచ్చట్లు

అనంతపురం రూరల్‌ మండలంలో పరిధిలోని కందుకూరు సమీపంలోని జంగాలపల్లి గోడౌన్‌ తిరిగి తెరచుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన స్టాకును ఈ గోడౌన్లలోనే నిల్వ ఉంచుకునేందుకు వీలుగా సన్నద్ధమవుతోంది. దీంతో ఇది వరకు పనిచేస్తూ ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన కార్మికులు, ఉద్యోగులు తిరిగి ఇక్కడికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రానికి సంబంధించిన పౌరసరఫరాలకు సంబంధించిన బియ్యం, ఇతర నిలువులు ఇక్కడ ఉంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గతంలో తరలింపు వెనుక అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించడంతోపాటు, దీనిపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు

.అనంతపురం నగరంలోనే అతి పెద్ద గోదాము జంగాలపల్లి వద్ద ఉంది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన గోడౌన్‌ ఇది. ఈ గోడౌన్‌లోనే ఆహార ధాన్యాలు నిల్వ ఉంచి పౌర సరఫరాలకు తరలించే వారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆహార ధాన్యాల సేకరణను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకే ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణను 2016 సంవత్సరం నుంచి చేపట్టింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఇక్కడ నిల్వ ఉంచకుండా నంద్యాలలో నిలువ ఉంచి అక్కడి నుంచి నేరుగా మండల స్టాక్‌ పాయింట్లకు తరలించడం ప్రారంభించారు.

దీంతో అంతక ముందు వరకు ఎఫ్‌సిఐ గోడౌన్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్న 500 మందికి ఉపాధి లేకుండాపోయింది. ఆ సమయంలోనే సిఐటియు సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించి, గోడౌన్‌ను ఇక్కడే ఉంచే విధంగా నిర్ణయం చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా గోడౌన్‌లో నిలువను నిలిపివేసింది. ఇక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరినీ ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇక్కడి నుంచే పౌర సరఫరాల కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం. నెలకు సగటున 40 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఎఫ్‌సిఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు పొందింది. ఈ మేరకు ఇక్కడ పనిచేస్తూ బదిలీపై వెళ్లిన వారిని తిరిగి ఇక్కడికే నియమించే విధంగానూ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది జరుగుతూనే తిరిగి మూతపడ్డ జంగాలపల్లి ఎఫ్‌సిఐ గోడౌన్‌ వద్ద తెరచుకుని, సందడి నెలకొనే అవకాశముంది.గత రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల నిల్వవను ఈ గోడౌన్‌లో కాకుండా నంద్యాలకు బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారం పెరగడంతో పాటు, అప్పటి వారికి ప్రయోజనం చేకూరేదని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు

. ఇక్కడి నుంచి అవుతే జిల్లాలోని ఏ ప్రాంతానికి ధాన్యం తరలించాలన్నా 150 కిలోమీటర్ల పరిధిలో తీసుకెళ్లే వీలుందని చెప్పారు. 2014-15 సంవత్సరం ముందు వరకు అంటే ఈ గోడౌన్‌ మార్పు జరగకముందు వరకు చూస్తే టన్ను ధాన్యం తరలింపునకు రూ.306 ఖర్చు అయ్యేదని చెప్పారు. అదే నంద్యాలకు మార్చిన తరువాత టన్ను ధాన్యం తరలింపునకు వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. జిల్లాలో తరలింపునకు రూ.10 కోట్ల వరకు ఖర్చు అవుతే మార్చిన తరువాత ఆ ఖర్చు రూ.30 కోట్లకు పెరిగిందని వివరించారు. నాలుగేళ్లకు కలిపి రూ.80 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడిందని చెప్పారు. అది కూడా 1991 నుంచి ఇప్పటి వరకు పరిటాల సునీత అనుచరులు, ఆమె కుటుంబ సభ్యులకే స్టేజ్‌ -1 కాంట్రాక్టు వస్తూ ఉండటం అనేక సందేహాలకు తావునిస్తోందన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని తాను డిమాండ్‌ చేస్తున్నానని వివరించారు. నంద్యాలకు మార్చడం వెనుక అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రిగానున్న పరిటాల సునీత ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. దీనిపై సిఐడి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వీటన్నింటిని పరిశీలించి ఇక్కడి నుంచి జిల్లాలో పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు, అందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.

 

Tags;The godown that finally opened

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *