గ్రాండ్ఓల్డ్ పార్టీ కాంగ్రెసుకు ఒకటే లక్ష్యం

Date:22/03/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
గ్రాండ్ఓల్డ్ పార్టీ కాంగ్రెసుకు ఒకటే లక్ష్యం. ఈ ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడాన్ని గమ్యంగా ఆ పార్టీ చూడటం లేదు. బీజేపీని నిలువరించగలిగితే చాలు. ఆ సంతృప్తి దక్కితే అదే పదివేలు. ఒకవేళ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పవర్ లోకి వచ్చినా ఫర్వాలేదు. మోడీ ప్రధాని కాకుంటే చాలు. అదే బ్రహ్మానందం. విపక్షాన్ని కకావికలు చేసి ప్రత్యర్థుల అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేయడంలో మోడీ దిట్ట. మరొకసారి హస్తం పార్టీ ఘోరపరాజయం పాలైతే కాంగ్రెసు ముక్త భారత్ నినాదానికి మళ్లీ ఊపిరిపోస్తారు మోడీ, షా ద్వయం. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ బలాన్ని తగ్గించాలనుకుంటోంది కాంగ్రెసు. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా మోడీ ప్రధాని కాకుండా చూడాలనుకుంటోంది. అయితే రోజురోజుకీ మారుతున్న పరిస్థితులు, రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. ఏడాది కాలంగా తగ్గుతూ వచ్చిన ప్రధాని గ్రాఫ్ మళ్లీ పైపైకి పెరుగుతోంది. మరోవైపు ఇటీవల అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెసు కుంపట్లు మొదలైపోయాయి. లోక్ సభ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల నాటి విజయాలు తిరిగి దక్కే సూచనలు కనిపించడం లేదు. భవిష్యత్తులో యూపీఏ కి సహకరిస్తాయని భావిస్తున్న ప్రాంతీయ పార్టీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెసు గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి.
సమాజ్ వాదీ, బహుజన సమాజ్ చేతులు కలిపినప్పుడు అందరికంటే సంతోషించిన పార్టీ కాంగ్రెసు. కమలం పార్టీకి గుండె కాయ ఉత్తరప్రదేశ్. కేంద్రంలో అధికారం చేపట్టడానికి అవసరమైన 73 స్థానాలను కట్టబెట్టింది. యూపీలో కాంగ్రెసుకు ఎలాగూ సొంతబలం పెద్దగా లేదు. ఎస్పీ,బీఎస్పీలు పొత్తు కట్టి పోటీ చేస్తే బీజేపీ పద్దు నుంచి ఒక యాభై స్థానాలు చేజారిపోతాయని కాంగ్రెసు అంచనా వేసింది. 25 స్థానాలకే బీజేపీ పరిమితమవుతుందని పరిశీలకులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ పాకిస్తాన్ పై దాడి తర్వాత మోడీ మళ్లీ ప్రజల దృష్టిలో పెరుగుతున్నారు. ఎస్పీ, బీఎస్పీల శక్తి సంఘటితంగా ఒక్కటై నిలుస్తుందన్న నమ్మకం లోపిస్తోంది. కొన్ని చోట్ల అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. ప్రియాంక రంగప్రవేశం తర్వాత హస్తం పార్టీ ఓటు బ్యాంకు రెండు శాతం మేరకు పెరిగే సూచనలున్నాయంటున్నారు. ఇవన్నీ కలిసి ఎస్పీ, బీఎస్పీ సీట్లకు ఎసరుపెడతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు పార్టీలకు 55 సీట్లు వస్తాయనుకున్న ప్రాథమిక సర్వేలు తాజాగా సవరింపులకు గురవుతున్నాయి. కొత్త సర్వేక్షణలు మాయావతి, అఖిలేష్, అజిత్ సింగ్ ల పొత్తు బలాన్ని 35 సీట్లకు కుదించేస్తున్నాయి. కాంగ్రెసు బలం 3 నుంచి 4 సీట్లే. బీజేపీ నలభై సీట్లకు చేరువలో ఉంటుందంటున్నారు. 2014తో పోలిస్తే బీజేపీకి ఇక్కడ తగ్గే బలం 30 మాత్రమే . ఆ లోటును వేరే చోట పూడ్చుకుంటుంది. పొత్తుల ద్వారా సమీకరించుకుంటుంది. దీంతో కమలం అధికార రథానికి బ్రేకులు వేస్తుందనుకుంటున్న యూపీ అంచనాలు తలకిందులవుతున్నాయి.
ప్రధాని మోడీతో వ్యక్తిగత వైరం కనబరిచే మమత బెనర్జీకి ఈసారి కష్టాలు తప్పడం లేదు. పశ్చిమబంగలో మమత ఏకచ్ఛత్రాధిపత్యానికి రానున్న ఎన్నికల్లో కొంతమేరకు గండిపడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెసు కలిసి కట్టుగా బరిలోకి దిగితే తృణమూల్ కాంగ్రెసు తర్వాత రెండో పక్షంగా నిలుస్తాయి. ఇప్పుడు ఆ రెండూ కలవడం లేదు. ఓట్ల చీలిక ఏర్పడుతోంది. దీంతో మమతకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ రూపుదాలుస్తోంది. మైనారిటీలను బుజ్జగిస్తూ, వారికి వరాలు కురిపిస్తూ 27శాతం వరకూ ఉన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా మమత పార్టీ ఇంతవరకూ పొందుతూ వస్తోంది. కమ్యూనిస్టు, కాంగ్రెసు కూటమి కాకుండా బీజేపీ ప్రత్యర్థిగా మారితే హిందూ ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. అది కమలం పార్టీకి భారీ లబ్ధి చేకూరుస్తుంది. మమత క్లీన్ స్వీప్ చేసి తన బలాన్ని యూపీఏకి లేదా మరో ఫ్రంట్ కు ఏదో రూపంలో అందచేస్తుందని అంచనా వేసుకుంటున్న కాంగ్రెసు కలలు కల్లలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల్లో ఏర్పడుతున్న లోటును పశ్చిమబంగ వంటి రాష్ట్రాల్లో పూడ్చుకునే అవకాశాలు బీజేపీకి పెరుగుతున్నాయి.కాంగ్రెసు పార్టీ 2018 నుంచి పుంజుకుంటూ వస్తోందన్న భావన దేశవ్యాప్తంగా ఏర్పడింది.
గుజరాత్ లో బీజేపీని దీటుగా ఎదుర్కొంది. 15 సంవత్సరాల అనంతరం మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లను చేజిక్కించుకోగలిగింది. రాజస్థాన్ కోటలో పాగా ఎగరవేసింది. కొన్ని పక్షాలు క్రమేపీ కాంగ్రెసు వైపు చేరడం మొదలయ్యాయి. టీడీపీ జాతీయస్థాయిలో స్నేహహస్తం అందిస్తోంది. జేడీఎస్ కలిసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ చేరువ అయ్యింది. ఇవన్నీ శుభసంకేతాలే. అయితే హస్తం పార్టీలో దశాబ్దాలుగా నెలకొన్న ముఠాతత్వం మళ్లీ పార్టీని ముళ్ల కుంపటిపై నిలబెడుతోంది. మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్, కమలనాథ్, జ్యోతిరాదిత్య సింధియా లు వర్గ పోరుకు తెర లేపుతున్నారు. అక్కడ పార్టీ అధికారంలో ఉండటంతో ప్రజలు మళ్లీ విసిగి బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో పెద్ద పీటవేసే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బొటాబొటి మెజార్టీతో రథం లాగుతున్న రాజస్తాన్ లోనూ సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ ల పోరు పార్టీని ముంచేసే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెసు 2014లో కేవలం 44 స్థానాలతో లోక్ సభలో ప్రతిపక్ష హోదా కూడా పొందకుండా కుదించుకుపోయింది. కొత్తగా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులోనూ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దాంతో అధికారానికి పోటీ పడవచ్చనుకుంది కాంగ్రెసు. కానీ సొంత కుంపట్లతో పరిస్థితిని దిగజార్చుకుంటున్నారు. స్వయంకృతాపరాధాలతో పవర్ రేసులో బాగా వెనకబడుతున్నారు. మళ్లీ మోడీ భారతానికే మార్గం సుగమం చేస్తున్నారు.
Tags:The GrandWorld party is the only target for the Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *