భారీగా తగ్గిన  దిగుబడి

The heavily reduced yield

The heavily reduced yield

వరి… వర్రీ..
Date:11/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం నిర్ధేశించిన తిండిగింజల ఉత్పత్తి లక్ష్యంలో భారీ కోత పడనుంది. ఆహార పంటలన్నీ కలుపుకొని 98 లక్షల టన్నుల దిగుబడులు సాధించాలని వ్యవసాయశాఖ కార్యా చరణ ప్రణాళికలో నిర్ణయించగా 83 లక్షల టన్నులు మాత్రమే లభించనున్నాయి. లక్ష్యంలో సుమారు 15 లక్షల టన్నులు తగ్గనున్నాయి. తగ్గనున్న దిగుబడుల్లో వరి ధాన్యానిదే సింహభాగం. దాదాపు పది లక్షల టన్నుల మేర కత్తెర పడనుంది. ముతక, పప్పు ధాన్యాల ఉత్పత్తి సైతం ఈసారి తగ్గనుంది. వేరుశనగ దిగుబడుల్లో భారీ క్షీణత కనిపిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో సాగు విస్తీర్ణం తగ్గగా సాగైన పంటలను వర్షాల మధ్య అంతరాయాలు  దిగుబడులను దెబ్బ తీశాయి.
అర్థ గణాంక శాఖ ఖరీఫ్‌ ఉత్పత్తులపై మొదటి ముందస్తు అంచనాలు రూపొందించింది. వ్యవసాయశాఖ వార్షిక ప్రణాళికలో నిర్ధేశించిన లక్ష్యాలకు, ఈ ముందస్తు అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది.రాయలసీమలో కరువు రావడంతో అక్కడ అధికంగా సాగు చేసే వేరుశనగ దారుణంగా దెబ్బతింది. ఆ ప్రభావం నూనెగింజల దిగుబడులపై పడింది. వ్యవసాయ ప్లాన్‌లో ఈ ఏడాది ఖరీఫ్‌లో 10.28 లక్షల టన్నుల నూనెగింజల ఉత్పత్తిని లక్ష్యంగా చెప్పగా ముందస్తు అంచనాల్లో 4.05 లక్షల టన్నులే వస్తాయని తెలిపారు. ఉత్పాదకత 1,113 కిలోలు సాధించాలని ప్లాన్‌లో పేర్కొనగా ముందస్తు అంచనాల్లో 725 కిలోలకు పడిపోయింది. వేరుశనగతో సహా అన్ని నూనెగింజలూ ప్లాన్‌లో 10.92 లక్షల టన్నులొస్తాయని తెలపగా ముందస్తు అంచనాల్లో 4.32 లక్షల టన్నులకు దిగజారింది. కాగా అనూహ్యంగా ఈ తడవ ఆయిల్‌పామ్‌ను తెరమీదకి తీసుకొచ్చి మొత్తంగా నూనెగింజల ఉత్పత్తి బాగా పెరుగుతుందని ముందస్తు అంచనాల్లో మాయ చేశారు.
పామాయిల్‌ దిగుబడులు 18.13 లక్షల టన్నులొస్తాయంటూ నూనెగింజల దిగుబడులను అమాంతం 22.45 లక్షల టన్నులకు పెంచి జిమ్మిక్కుకు పాల్పడ్డారు. వాస్తవానికి పామాయిల్‌ సాగు, దిగుబడుల లక్ష్యం ఇప్పటి వరకు వ్యవసాయ ప్రణాళికలో లేదు. ఇక ప్రధాన వాణిజ్య పంట పత్తి దిగుబడులూ తగ్గనున్నాయి. వ్యవసాయ ప్రణాళికలో 20.82 లక్షల బేళ్ల ఉత్పత్తిని ఆశించగా ముందస్తు అంచనాల్లో 17.54 లక్షల  బేళ్లొస్తాయన్నారు. ఉత్పాదకత టార్గెట్‌ 600 కిలోలు కాగా ముందస్తు అంచనాల్లో 525 కిలోలకు తగ్గింది.నిరుడు మొదటి ముందస్తు అంచనాల కంటే ఆహార పంటల సాగు స్వల్పంగా పెరిగినప్పటికీ దిగుబడులకొచ్చేసరికి మూడు వేల టన్నులు తగ్గాయి. వరినే తీసుకుంటే 14.55 లక్షల హెక్టార్లలో సేద్యం జరుగుతుందని 75.17 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేయగా సాగు 14.77 లక్షల హెక్టార్లకు పెరిగినా దిగుబడులు 74.12 లక్షల టన్నులొచ్చాయి.
హెక్టారుకు ధాన్యం ఉత్పాదకత 5,166 కిలోలు సాధించాలనుకోగా 5,019 కిలోలు లభించాయి. ఈ మారు ఖరీఫ్‌లో వరి సేద్యం ఇప్పటికే దాదాపు పూర్త యింది. 14.73 లక్షల హెక్టార్లలో సాగైంది. కానీ అంచనాల్లో 15.15 లక్షల హెక్టార్లలో సాగవు తుందని పేర్కొని గతేడాది వచ్చిన ఉత్పాదకత ఈ సారి కూడా వస్తుందని లెక్కకట్టి 76.03 లక్షల టన్నులొస్తాయంటున్నారు. నిరుటి కంటే ఎక్కువ దిగుబడులొస్తాయని చూపేందుకు సర్కారు తాపత్రయ పడుతోంది. గత సంవత్సరం కంటే వరి సాగు తగ్గింది. తీవ్ర దుర్భిక్షం తిష్టవేసింది. సర్కారు ఆ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదు. ఆర్భాటంగా నిర్ణయించిన వ్యవసాయ ప్రణాళిక లక్ష్యాలను అస్సలు పట్టించుకోలేదు.
Tags:The heavily reduced yield

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *