వానపైనే ఆశలు

Heavy rain in Shamshabad

Heavy rain in Shamshabad

Date:12/06/2019

గుంటూరు  ముచ్చట్లు:

 

ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేసింది. ఏరువాక సాగాల్సిన సమయం ఆసన్నమైంది. రైతుకు కంటి మీద కునుకు కరవైంది. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. మబ్బు పట్టినా వాన జాడ కనిపించడం లేదు. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. కొత్త సీజన్‌ రాకతో ఈ జిల్లాల్లోని డెల్టా రైతులు పొలం పనులకు సమాయత్తం అవుతున్నారు. సాగునీరు అందితేనే కృష్ణా డెల్టాలో పంటలు వేసేది. రైతులకు పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి జలాలే ఆధారం. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టాలోని రైతులు కూడా సాగు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది జూన్‌ 16నే కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సంవత్సరం ఇంకా గోదావరికి వరద నీరు రాలేదు. ఈ నేపథ్యంలో అన్నదాతలు నీటి కోసం వేయి కళ్లతో చూస్తున్నారు. ముందే పంట వేస్తే ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుంచి తప్పించుకోవచ్చని ఆలోచిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడితే వరద పోటెత్తే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ వానలు కురవకపోయినా గోదావరికి వరద వస్తే చాలని భావిస్తున్నారు.

 

 

 

 

 

ఇంకా చినుకు జాడ లేనందున జలవనరుల శాఖ అధికారులు ప్రస్తుతం తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండు జిల్లాల్లోని తాగు, సాగునీటి అవసరాలను ప్రకాశం బ్యారేజి తీరుస్తోంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు. ప్రస్తుతం 10.3 అడుగులు ఉంది. తాగునీటి అవసరాల కోసం ఇటీవల పులిచింతల నుంచి 1.5 టీఎంసీల నీటిని తీసుకున్నారు. వేసవి దృష్ట్యా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పురపాలికలు, పంచాయతీలకు ఈ నీటిని అందిస్తున్నారు. కృష్ణాలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. జిల్లా కేంద్రం మచిలీపట్నం, గుడివాడ, పెడన, కైకలూరు, కృత్తివెన్ను, తదితర ప్రాంతాల్లో సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో గత నెల 29 నుంచి బందరు, రైవస్‌ కాలువలకు నీటిని వదులుతున్నారు. తొలి రోజు 1,500 క్యూసెక్కులు వదిలారు. ఆ తర్వాత.. దీనిని 1,200 క్యూసెక్కులకు తగ్గించారు. ఆదివారం 900 క్యూసెక్కులు వదిలారు. ఇందులో రైవస్‌ కాలువకు 700 క్యూ, బందరు కాలువకు 200 క్యూసెక్కులు ఇస్తున్నారు. ఇలా మరో వారం పాటు నీటిని అందించనున్నారు.

 

 

 

 

 

కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో దాదాపు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో పట్టిసీమ నీరు ఆదుకుంది. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షాలే పడినా కృష్ణా డెల్టాలోని రైతులను పట్టిసీమ జలాలు ఆదుకున్నాయి. రికార్డు స్థాయిలో 100 శాతం మేర నాట్లు పూర్తయ్యాయి. దీంతో డెల్టా పరిధిలోని నాలుగు జిల్లాల్లో వరి దిగుబడులు భారీగా వచ్చాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి కోతల వరకు ఎక్కడా నీటికి ఇబ్బంది లేకపోయింది. దీంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా లేకపోవడంతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా దిగుబడి ఇళ్లకు చేరింది. కృష్ణా డెల్టా కింద పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తూర్పు కాలువ పరిధిలో 7.36 లక్షల ఎకరాలు, పశ్చిమ కాలువ కింద 5.71 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 11.12 లక్షల ఎకరాలలో వరి, చెరకు.. 24,213.8 ఎకరాలలో సాగు చేస్తారు. పట్టిసీమ ద్వారా వస్తున్న గోదావరి నీటికి స్వల్పంగా కృష్ణా జలాలు తోడయ్యాయి. 2015- 16లో 8.99 టీఎంసీలు, 2016 – 17లో 48.47 టీఎంసీలు, 2017 – 18లో 90.19 టీఎంసీలు, 2018- 19 81.39 టీఎంసీల మేర గోదావరి జలాలను ఎత్తిపోశారు.

 

 

 

 

సాధారణంగా డెల్టా ప్రాంతంలో అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాన్లు వస్తాయి. ఈ సమయాలలో వరి పంట పొలాల్లో నీరు నిలిచి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకే రైతులు ముందుగా వరి పంట వేస్తున్నారు. ముందే వేయడం వల్ల దిగుబడులు కూడా పెరిగాయి. సగటున 2015లో 27 బస్తాలు, 2016లో 30, 2017లో 32, 2018లో 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి నమోదైంది. గోదావరి జలాలతో వచ్చిన ఒండ్రు మట్టితో భూములు సారవంతం అయ్యాయి. దీని వల్ల ఎరువుల వినియోగం తగ్గింది. ఈ ఖర్చు రైతులకు కలసి వచ్చింది. పట్టిసీమ జలాల రాకతో జూన్‌లోనే వరినాట్లు వేస్తున్నారు. ఈ కారణంగా నవంబరు, డిసెంబరు నెలల్లో సంభవించే తుపాన్ల నుంచి బయటపడుతున్నారు. ఎకరాలకు దాదాపు 40 బస్తాలకు పైగా దిగుబడి రావడంతో అన్నదాతలకు ఆదాయం పెరిగింది.

 

 

 

 

 

 

గోదావరిలో 14 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న నీటినే మిగులు జలాలుగా పరిగణిస్తారు. అదనంగా ఉన్న నీటినే పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం ఆ స్థాయిలో నీటి మట్టం లేదు. దీంతో నీటిని తరలించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. వర్షాలు పడి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తేనే నీటిని తరలించవచ్చు. ఈ నెల 5న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకవచ్చని వాతావరణ విభాగ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో వర్షాలు పడితే ఈ నెలలోనే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరిలో నీటి నిల్వతో సంబంధం లేకుండా దీని పరిధిలోని కాలువలకు 7వేల క్యూసెక్కులు మేర వదులుతున్నారు. అక్కడ నీటి మట్టం పెరిగితే పట్టిసీమకు 9వేల క్యూసెక్కుల వరకు తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టా రైతులు వరుణుడిపైనే భారం వేసి ఎదురు చూస్తున్నారు.

 

 

 

Tags:The hopes on the rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *