కన్నడ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల ప్రభావం

Date:14/04/2018
.
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలుగు రాజకీయాలు పొరుగు రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. కన్నడ నేలను తెలుగు నేతలు కంగారుపెడుతున్నారు. పక్క రాష్ట్రంలో తమ ప్రతిభను చూపించడానికి నాయకులు ఆరాటపడుతున్నారు. ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి పొరుగు రాష్ట్రానికి వెళ్లి మరి ప్రచారం చేస్తామని శపథం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంతో కర్ణాటక బీజేపీ ముంచేయడానికి సెటిలర్స్ సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్ తో దోస్తీ కట్టిన కేసీఆర్ కాంగ్రెస్ తో పాటు కమలనాథులను ఓడిస్తామంటున్నారు. దీంతో కర్ణాటక రాజకీయం తెలుగు నాట చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న  కర్ణాటకలో తెలుగు ప్రభావం అధికంగానే ఉంది.  రాజధాని బెంగళూరుతో పాటు దాదాపు పది జిల్లాల్లో తెలుగు మాట్లాడే వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఆంధ్రాకు సరిహద్దుల్లో ఉన్న రాయచూరు, బళ్ళారి, తుంకూరు, చిత్రదుర్గ, గుల్బర్గ, కోలార్, కొప్పల జిల్లాల్లో తెలుగు వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడి తెలుగు వాళ్లల్లో అంతా ఆంధ్రా మూలాలు ఉన్నవారే. దీంతో ఎపీ ప్రత్యేక హోదా అంశం ఇక్కడ ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా అక్కడ స్థిరపడిన తెలుగు వాళ్లు స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతు దారులుగా ఉండగా బీజేపీ, జేడిఎస్ తో పాటు ఇతర పార్టీలో కూడా తెలుగు వారు ఉన్నారు. అయితే ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీ దెబ్బయాలన్న పట్టుదలతో ఉన్న ఆంధ్రా నేతలు ఇక్కడికి వెళ్లి ప్రచారం చేయడానికి సిద్ధమౌతున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పైన పెరుగుతున్న వ్యతిరేకతకు తోడు ప్రత్యేక హోదా అంశం తెలుగు వారిపైన ప్రభావం చూపించనున్నది. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లోని తమ మూలాలున్న ప్రాంతాలతో వీరికి సంబంధాలు ఉన్నాయి. తెలుగు నేతలతో బంధుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఇక్కడి ప్రజల ఆకాంక్ష కర్ణాటక ఆంధ్రులపైన పడటం ఖాయం. దీంతో కర్ణాటక కమలనాథులు ఆందోళనలో ఉన్నారు. మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా కర్ణాటక రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారు. జనతాదళ్ సెక్యూలర్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తో బెంగళూరులో భేటీ అయిన కేసీఆర్ ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. కర్ణాటకలో తెలుగు వారంతా జేడీఎస్ కు మద్దతివ్వాలని ఆయన కోరారు. అయితే కన్నడ నేలపైన కేసీఆర్ ప్రభావం ఎంత అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ఉన్న తెలుగు వారిలో తొంభై శాతం మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే. దీంతో వీరిపైన చంద్రశేఖర్ రావు ప్రభావం ఏ మాత్రం ఉండదని చెపుతున్నారు. ఇదే సమయంలో పాత హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న బీదర్, యాద్గీర్, కలబరిడి,వాడి తదితర ప్రాంతాల్లో తెలంగాణ వాసుల సంఖ్య చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంది. దీంతో ఇక్కడ కేసీఆర్ ప్రచారం చేస్తే కొంత ప్రభావితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో జేడీఎస్ బలం నామమాత్రం. దీంతో చంద్రశేఖర్ రావు ప్రచారం డైలామాలో పడే అవకాశముంది.జేడీఎస్ కు కొంత పట్టున్న బెంగళూరు, మైసూరుల్లో కేసీఆర్ టూర్ కు ఛాన్స్ ఉంది.
Tags:The influence of Telugu states on Kannada results

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *