ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
– పంచమితీర్థంనాడు విశేష సంఖ్యలో భక్తుల పవిత్రస్నానం
– భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
-. జర్మన్ షెడ్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ

-. పోలీసులు, టీటీడీ విజిలెన్స్, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ విశేష సేవలు
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఆలయం వద్ద గల పద్మ పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి పవిత్రస్నానాలు ఆచరించారు.ఈ ఉత్సవానికి విచ్చేసిన అశేష భక్తజనవాహినికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ధర్మకర్తల మండలిఅధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ్ కుమార్ , టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
పంచమితీర్థానికి విచ్చేసిన భక్తులకు పోలీసు శాఖ సమన్వయంతో టీటీడీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు సేద తీరడానికి ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్ల నుంచే ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేసి భక్తులను క్రమపద్ధతిలో పుష్కరిణిలోకి అనుమతించారు. పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరువేరుగా గేట్లను ఏర్పాటుచేశారు. సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కాలినడకన వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుచానూరు బయటి నుంచే వాహనాలను దారి మళ్లించారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలకు, పాడిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టారు. 2500 మంది పోలీసులతోపాటు టీటీడీ భద్రతా సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్.సి.సి విద్యార్థులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి సేవకులు, స్కౌట్స్ విశేషసేవలు
బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విశేష సేవలు అందించారు. ఆలయంలోని క్యూలైన్లు, వాహనసేవల్లో, అన్నప్రసాద భవనం, జర్మన్ షెడ్లలో భక్తులకు సేవలందించారు. మొత్తం 1000 మంది శ్రీవారిసేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలు అందించారు.
జర్మన్ షెడ్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ
భక్తుల కోసం అయ్యప్ప స్వామి ఆలయం, పూడి రోడ్డు, జెడ్పీ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లలో వేచి ఉన్న భక్తులకు ఆదివారం మధ్యాహ్నం నుంచి కాఫీ, టి, బాదం పాలు, అన్నప్రసాదాలు, తాగునీరు విస్తృతంగా అందజేశారు.
భక్తులకు వైద్యసేవలు
బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు విశేషంగా వైద్యసేవలు అందించారు. అమ్మవారి వాహనం మోసే వాహనబేరర్లకు వైద్యపరంగా తగిన చర్యలు చేపట్టి ఉపశమనం కల్పించారు. టీటీడీ వైద్యులతోపాటు స్విమ్స్, రుయా ఆస్పత్రుల నుంచి వైద్యసిబ్బంది, ఆయుర్వేద వైద్యులు సేవలందించారు. తోళప్పగార్డెన్‌లో ఉన్న డిస్పెన్సరీతోపాటు అదనంగా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 6 అంబులెన్సులతోపాటు శుక్రవారపుతోట పద్మపుష్కరిణి వద్ద ప్రథమచికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన
హిందూ ధార్మిక ప్రాజెక్టులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల్లో కోలాటాలు, భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన జానపద కళాబృందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరుచానూరులోని ఆస్థానమండపం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి శిల్పారామం వేదికలపై ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్వీ గోశాల ఆధ్వర్యంలో వాహనసేవల ఎదుట గజాలు, అశ్వాలు, వృషభాల ఊరేగింపు వేడుకగా సాగింది.
పార్కింగ్
పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు శిల్పారామం, తనపల్లి క్రాస్, మార్కెట్‌యార్డు, పూడి రోడ్డు ,తిరుచానూరు బైపాస్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
Tags: The Kartika Brahmotsavams of Sri Padmavati Amma have concluded
