సభ్యుల సవరణలు తరవాతే హాజరు అవుతా

   Date:15/03/2019
న్యూ ఢిల్లీ   ముచ్చట్లు:
లోక్‌ పాల్‌ ఎంపిక కమిటీ సభ్యుల విషయంపై పలు సవరణలు చేసిన తరవాతే తాను లోక్‌పాల్‌ ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు అవుతానని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. సమావేశానికి ‘ప్రత్యేక ఆహ్వానితుని’గా ఆహ్వానించడం వల్లే తాను సమావేశానికి హాజరు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇదే కారణంతో గతంలోనూ ఖర్గే పలుసార్లు సమావేశాన్ని బహిష్కరించారు. తన గైర్హాజరును సాకుగా చూపి లోక్‌పాల్‌ నియామకాన్ని కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. లోక్‌పాల్‌ ఎంపిక కమిటీ సభ్యుల విషయంపై పలు సవరణలు చేసిన తరవాతే తాను సమావేశానికి హాజరు అవుతానని తేల్చి చెప్పారు. ప్రత్యేక ఆహ్వానితునిగా పరిగణించడం వల్ల చర్చలో తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఉండదని ఆయన తెలిపారు. ప్రతిపక్షంలోని అతిపెద్ద పార్టీకి చెందిన వ్యక్తిని సభ్యునిగా చేర్చేలా లోక్‌పాల్‌ చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత అందుకు అనుగుణంగా సవరణలు చేయడంపై ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. లోక్‌పాల్‌ ఎంపికలో ప్రతిపక్ష పార్టీకి స్థానం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖర్గే ఆరోపించారు.
లోక్‌పాల్‌ నియామకంపై ఎంపిక కమిటీ సమావేశమయ్యే తేదీలను తెలపాలని మార్చి 7న కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకుగానూ పది రోజుల గడువు విధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన శుక్రవారం ఎంపిక కమిటీ సమావేశం కావాల్సిఉంది. లోక్‌పాల్‌ చట్టం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్‌, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన వ్యక్తి, ప్రతిపక్షనాయకుడు, మరికొంత మంది కీలక వ్యక్తులు ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉండాలి. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేని కారణంగా ఖర్గేను కేవలం ప్రత్యేక ఆహ్వానితునిగానే పరిగణిస్తున్నామని ప్రభుత్వ వాదన. దీంతో లోక్‌పాల్‌ నియామకం మరింత ఆలస్యమవుతూ వస్తోంది.
Tags:The Lokpal selection committee members will be appearing after the amendments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *