అభ్య‌ర్థుల ఎంపికను ప్రారంభించిన ప్ర‌ధాన పార్టీలు

Date:12/01/2019
నెల్లూరు ముచ్చట్లు:
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతూ ఉండ‌టంతో అభ్య‌ర్థుల ఎంపిక క‌స‌ర‌త్తును ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీల‌న్నీ ప్రారంభించాయి. కొన్ని అర్హతల్ని పెట్టుకుని, గెలిచే స‌త్తా ఉన్న‌వారినే ఎంపిక చేసేందుకే దాదాపు అన్ని పార్టీలూ ప్ర‌య‌త్నిస్తాయి. ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా విష‌యానికొస్తే… ప్రాథ‌మికంగా కొంత‌మంది అభ్య‌ర్థుల ఎంపిక జ‌రిగిపోయింద‌నే ప్ర‌చార‌మే ఈ మ‌ధ్య జ‌రిగింది. తెలంగాణ‌లో కేసీఆర్ అనుస‌రించిన‌ట్టుగా, ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందుగానే అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించేస్తే… రెబెల్స్ బెడ‌ద‌ను త‌ట్టుకోవ‌డం సులువు అవుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టూ క‌థ‌నాలొచ్చాయి. ఇచ్ఛాపురంలో జ‌రిగిన పాద‌యాత్ర ముగింపు స‌భ‌లోనే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని వైకాపా వ‌ర్గాలూ బ‌లంగానే న‌మ్మాయి. అయితే, అక్క‌డ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చెయ్య‌లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల దృష్ట్యా అది స‌రైన వ్యూహం కాద‌నే స్ప‌ష్ట‌తకు వైకాపా వ‌చ్చింద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.
అభ్యర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌లో ఆర్థికంగా బాగా బ‌లంగా ఉన్న వారికే ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే ఉద్దేశంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఎందుకు వారికే ప్రాధాన్య‌త అంటే… అధికార పార్టీ ఎన్నిక‌ల్లో విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తుంద‌నీ, దాన్ని తట్టుకునే విధంగా ఉండాలంటే తామూ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌నే కోణంలోనే అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఈ అంశానికి ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టుగా చెబుతున్నారు! దీంతోపాటు, ఇప్ప‌టికే రెండు బృందాల‌తో క్షేత్ర‌స్థాయిలో వైసీపీ స‌ర్వే చేయిస్తోంద‌ని స‌మాచారం. ఏయే నియోజ‌క వ‌ర్గాల్లో వైకాపా బ‌ల‌హీనంగా ఉంది, టిక్కెట్లు ఆశిస్తున్నవారి బ‌లాబ‌లాలు ఏంట‌నే లెక్క‌లు గ‌ట్టేందుకు స‌ర్వేలు జ‌రుగుతున్న‌ట్టు చెబుతున్నారు. ఈ స‌ర్వేల ఆధారంగా… ఆర్థికంగా బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఎక్క‌డెక్క‌డ అవ‌స‌ర‌మౌతారు అనే లెక్క‌లు వేసే క‌స‌ర‌త్తు వైసీపీ చేస్తోంద‌ని స‌మాచారం.
ఇంత క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది కాబ‌ట్టే… ముంద‌స్తుగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఉండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.ఎన్నికల్లో డ‌బ్బు గురించి జ‌గ‌న్ అయితే పాద‌యాత్ర‌లో బాహాటంగానే మాట్లాడుతూ వ‌చ్చారు. చంద్ర‌బాబు నాయుడు ఎంత ఇచ్చినా తీసుకొండి, కానీ ఓటు మాత్రం వైకాపాకు మాత్ర‌మే వేయాలంటూ పిలుపునిచ్చిన స‌భ‌లు చాలానే ఉన్నాయి. డ‌బ్బు తీసుకోవాలని ప‌రోక్షంగా ప్రోత్సాహించ‌డ‌మే క‌దా… ఈ వ్యాఖ్య‌ల వెన‌క క‌నిపిస్తున్న ఉద్దేశం! ప్ర‌జ‌ల్లో ఉన్న‌ప్పుడు నీతులు మాట్లాడి… అభ్య‌ర్థుల ఎంపిక వచ్చేస‌రికి డ‌బ్బునే అర్హ‌త‌గా నిర్ణ‌యించుకోవ‌డాన్ని ఏ త‌ర‌హా రాజ‌కీయం అనాలి..? ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌స్థావ‌న రావ‌డ‌మే ఒక దారుణ‌మైన విష‌యం. దాన్నొక అర్హ‌తగా పెట్టుకుని అభ్య‌ర్థుల ఎంపిక అనేది.. అది ఏ పార్టీ చేసినా స‌మర్థ‌నీయం కాదు.
Tags:The main parties to launch the selection of candidates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *