– అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ
– తిరుపతిలో ఘనంగా మెట్లోత్సవం
తిరుపతి ముచ్చట్లు:
ధర్మమార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ చెప్పారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం ఉదయం అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ, పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని, ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన దాదాపు 2000 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు, ప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. ఏప్రిల్ 5వ తేదీన శుక్రవారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం ఉంటుందని వివరించారు.
ఆకట్టుకున్న సంకీర్తనల గోష్టిగానం :
ముందుగా ఆలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్లపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం చేపట్టారు. ఇందులో ‘బ్రహ్మ కడిగిన పాదము…., భావములోన బాహ్యమునందును…, ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు…, పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా…, కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు…..” కీర్తనలున్నాయి. భక్తులు పరవశించి గోష్టిగానంలో పాలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, అన్నమాచార్య వంశీయులు శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులు, ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు.
Tags:The meaning of Metlotsavam is the means of life progress