ఆళ్లగడ్డ పేరు చెప్పగానే భూమా, గంగుల ఫ్యామిలీలు గుర్తొస్తాయి

 Date:22/03/2019
కర్నూలు ముచ్చట్లు:
ఆళ్లగడ్డ.. ఈ పేరు చెప్పగానే భూమా, గంగుల ఫ్యామిలీలు గుర్తొస్తాయి. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బరిలో దిగుతుండగా.. వైఎస్ఆర్సీపీ నుంచి గంగుల ప్రభాకర రెడ్డి కుమారుడు బ్రిజేంద్ర రెడ్డి బరిలో దిగుతున్నారు. పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని జనసేన బీఎస్పీకి కేటాయించింది. ప్రధానంగా పోటీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్యే ఉండనుంది. ఇక్కడ రాజకీయం పార్టీల చుట్టూ మాత్రమే కాకుండా వర్గాల చుట్టూ తిరుగుతుంది. 1967 నుంచి ఆళ్లగడ్డలో గంగుల, భూమా, సోముల (ఎస్వీ సుబ్బారెడ్డి) కుటుంబాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక్కడ మొదట్లో గంగుల ప్రభాకర్ రెడ్డి తండ్రి తిమ్మారెడ్డి, భూమా నాగిరెడ్డి తండ్రి బాలిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. బాలి రెడ్డి హత్య తర్వాత ఆయన కుమారులు శేఖర్, నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తిమ్మారెడ్డి చనిపోయాక ఆయన కుమారులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఆయన వారసత్వాన్ని అందుకున్నారు. తరాలు మారిన ఇరు కుటుంబాల మధ్య వైరం మాత్రం మారలేదు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి గంగుల తిమ్మారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1972లో భూమానాగిరెడ్డి మామ ఎస్వీ సుబ్బారెడ్డి తిమ్మారెడ్డిని ఓడించారు. 1978లో మళ్లీ తిమ్మారెడ్డి గెలిచారు. 1980లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 1983లో ఎస్వీ సుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచారు. 1985లో కాంగ్రెస్ తరఫున గెలిచిన గంగుల ప్రతాప్ రెడ్డి.. మళ్లీ 2004లో అదే పార్టీ తరఫున భూమా నాగిరెడ్డిపై విజయం సాధించారు. 1989లో భూమా నాగిరెడ్డి సోదరుడు శేఖర్ విజయం సాధించారు. 1994, 99లలో భూమా నాగిరెడ్డి గెలిచారు.2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి శోభానాగిరెడ్డి గెలుపొందారు. 2014లో ఆమె వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమె.. ఎన్నికల ప్రచారం సమయంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికే నామినేషన్ వేయడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని కొనసాగించారు. చనిపోయిన తర్వాత కూడా ఆమె గంగుల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు. తర్వాత ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ నుంచి భూమా అఖిల ప్రియ బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థిని పోటీలో నిలపక పోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ భూమా, గంగుల కుటుంబాలే బరిలో దిగుతున్నాయి. 2004 తర్వాత గంగుల ఫ్యామిలీ మరోసారి గెలుస్తుందా? లేదంటే.. భూమా ఫ్యామిలీ ఆధిపత్యం నిలుపుకొంటుందా అనేది చూడాలి. అన్నట్టు కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడు ఎస్వీ మోహన్ రెడ్డి తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక్కడ ఆయన తన మేనకోడలికి మద్దతిస్తారా? లేదా గంగుల ఫ్యామిలీకి అండగా నిలుస్తారా?
Tags:The name of the goddess is known as the Bhoomama and the Ganguly family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *