పనుల్లో నిర్లక్ష్యం.. వృధా అవుతున్న జలం..

Date:13/04/2018
కరీంనగర్ ముచ్చట్లు:
పట్టణీకీకరణ పుణ్యమాని కరీంనగర్ పరిధి విస్తరిస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్లుగా స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయంగా నీటి కొరతను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా పైప్‌లైన్‌ పనులు సాగుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా.. తవ్వకాల సమయంలోనే అజాగ్రత్తల వల్ల ఇది వరకే నీటి కోసం వేసిన సిమెంట్‌ పైప్‌లు ధ్వంసమవుతున్నాయి. దీంతో నీరు వృధా అవుతోంది. అసలే వేసవి. ఆపై నీటి కొరత ఉంటోంది. ఇలాంటి తరుణంలో నీరు వృధా అవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వకాలు సాగించేటప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని, పైప్‌లైన్లు పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వేసవిలో నీటికి కటకట నెలకొంటుందని స్పష్టం చేస్తున్నారు. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో  కరీంనగర్‌ పరిధిలో రహదారుల పనులు సాగుతున్నాయి. ఈ పనులను మే నాటికి పూర్తి చేయాలన్నది అధికారుల టార్గెట్. మొత్తం 14.5 కి.మీ రోడ్డు వేయాల్సి ఉండగా అందులో 7 కి.మీ మేర ఇప్పటికే పూర్తయింది. మిగతా 7.5 కి.మీ పొడవునా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. రహదారులకు ఇరువైపులా డ్రైనేజీలు, విద్యుత్తు టవర్లు, తాగునీటి పైపులైన్లు వేసే పనులు కూడా  చేస్తున్నారు. అయితే తాగునీటి పైపులైన్లు వేసే సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పనులు త్వరిగతిన పూర్తిచేయాలన్న తలంపుతో వేగంగా చేస్తున్నారు. హడావిడి పనుల ద్వారా పైప్‌లైన్లలో సమస్యలు వస్తున్నాయి. దీంతో స్థానికంగా పలు వీధుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని నగరవాసులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పనులు పక్కాగా సాగేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags:The neglect of works .. the water that is wasted

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *